పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని మఱియుఁ బెక్కుచందంబులఁ గందర్పు నిందించి యిందిందిరాలక లిందీవర
పాలకుం డగునిందు నుద్దేశించి యి ట్లనిరి.

123

చంద్రోపాలంభనము

సీ.

శ్రీసహజోన్నతిఁ జెలువొందుటయె కాక శ్రీసహజోన్నతిఁ జెలువుఁగంటి
సత్కళానిధివై ప్రశస్తిఁ గాంచుటె గాక సత్కళానిధివై ప్రశస్తిఁగంటి
కువలయహితవృత్తిఁ గొమరు మీఱుటె గాక కువలయహితవృత్తిఁ గొమరుగంటి
హరిణలక్ష్మాఖ్యత నందియుండుటె గాక హరిణ లక్ష్మాఖ్యత నంద గంటి


కదిసి విషమాంబగకుని కాప్తగరిమఁ గనుటె, గాక విషమాంబకుని కాప్తగరిమఁగంటి
తనరె నీవింత నీవింతఘనుఁడ వయ్యుఁ, జందమా మాచెలి నలంచఁ జందమామ.

124


అమృతకరుఁ డనుపేరు నీ కాదియంద, హీనుఁడై యొప్పుననుచు వాగీశుఁ డనుట
కర్థ మెవ్వరుఁ దెలియలేరైరి కాని, యరయ విరహులపాలిటి కదియ నిజము.

125


క.

ఇఱ్ఱందురు మఱ్ఱందురు, వెఱ్ఱులు నీలోనినలుపు విషరాశి సుమా
జుఱ్ఱుకొని నిన్ను రాహువు, గఱ్ఱున మఱి త్రేన్సకున్నె కాకున్న శశీ.

126


సీ.

తినలేక వెడలఁ గ్రక్కిన రాహు వెఱుఁగు నీయంగంబు విషమౌట యమృతమౌట
బడలి ఖిన్నతనొందు పద్మిని యెఱుఁగు నీచాయ వేండ్రంబౌట చల్లనౌట
నిలువున నీఱైన నెల ఱా లెఱుంగు నీకరము నిష్ఠురమౌట సరసమౌట
కవఁబాసి పొగులు జక్కవపక్షు లెఱుఁగు నీచర్య దారుణమౌట సౌమ్యమౌట


తే.

యాలిఁ గోల్పడ్డనీయుపాధ్యాయుఁ డెఱుగు, నీవు దుర్ణీతి వగుట సునీతి వగుట
యెఱుఁగ రన్యులు నీమర్మ మెఱుఁగకునికి, జనులు నిన్నుఁ గూరగ్రహ మనరు చంద్ర.

127


చ.

చతురుల మంచుఁ బండితులు సారెకు నీమెయికందుఁ జూచి క
ల్పితవచనంబులన్ మఱుఁగు వెట్టి శశంబు మృగంబు లాంఛన
స్థితి యని పల్కుచుందురు శశీ పటురౌద్రుఁడు వీరభద్రుఁ డు
ద్ధతి నిను గుండియల్ కమలఁదన్నినచోట నదేమి పాపమో.

128


తే.

కైరవాప్తకళంకంబు పేర విషము, లోనఁ బూర్ణించియుండఁ బైపైని చంద్రి
కలు వెలింగించెదవు కుత్తుకను విషంబు, నాలుకను బెల్లమును గాదె పాలసునకు.

129


క.

తమ్ములు కుముదప్రియ నీ, తమ్ములు నీయనుజనివసితమ్ములు శరజా
తమ్ములు నీయల్లుని కహి, తమ్ములుగాఁ జూడు వనుచితమ్ములు నడకల్.

130