పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వర్ణనీయ మిందీవరవర్ణనీయ, మందమహిమాతిశయమహీబృందముఖ్య
ముఖ్యులకు నాజవంజవసౌఖ్యదాన, చణనిరంకుశానుగ్రహసదన మదన.

114


ఉ.

హల్లకపాణి నీశరశరాసనచిహ్నము లక్షులందు భ్రూ
వల్లికలన్ వహించుకొని వర్తిలుచున్ మణితచ్ఛలంబున
న్మెల్లన యోగ్యవేళలను నీతిరుమంత్రముఁ బల్కు మాచెలిం
జల్లనిచూపు చూడు సుమసాయక నిల్పు మతాభిమానమున్.

115


వ.

అని ప్రార్థించుచు నించునిలుతునివలన నించుకైన ననుగ్రహంబు లేమి లేమ పరి
తాపాతశయం బవలోకించి కించిన్మధ్యలు వేసటపడుచు నప్పడుచుఁదనంబుల
పెద్ద నుద్దేశించి యి ట్లనిరి.

116

మన్మథోపాలంభనము

తే.

కుసుమసాయకశృంగారరసశరీర, శాలివగునీకు మనసు పాషాణమయము
సద్గుణము లేని దది యేటిచక్కఁదనము, కటాకటా తేనెపూసిన కత్తిగాదె.

117


ఉ.

నారఁట తేఁటి జోకనలినారఁట తేరఁట చిల్క సౌరభో
ద్గారఁట విల్లు పూతనయగారఁట చుట్టము శైత్యపున్ సదా
చారఁట కమ్మ గట్టుపరిచారఁట కోయిల కేతనీభవ
ద్వారఁట యిట్టినీ కొదుగువారఁట లోకు లదేమిచిత్రమో.

118


తే.

మారణోపాయమర్మకర్మములయందు, నీనృశంసత చూచికా నిర్ణయించె
సార్థకము గాఁగఁ బంకరుహాసనండు, మకరకేతన నీపేరు మారుఁ డనుచు.

119


క.

అసమాశుగ నీచాపము, కుసుమం బని పెద్దలనుట కుత్సితసుమమం
చుసుమీ కాకుండిన నే, కుసుమంబులు నరుల మన్నిగొను నీరీతిన్.

120


క.

ఎట్టు జనించితి వకటా, కట్టిఁడి వగునీవు మదన కరుణానిధులై
నట్టి తలిదండ్రులకు సుధ, పుట్టినజలరాశి విషము పుట్టినరీతిన్.

121


సీ.

కుటిలోగ్రనిటలదృఘ్ఘోరాగ్ని నీకు నిర్బంధపంచత్వంబు ప్రాప్త మగుట
యాకారహీనుఁడవై యుండియును గాలిచందాన లోకసంచారి వగుట
వేళఁ గాచుకొని యావేశించి యింతులఁ బురుషులఁ బీడపా ల్పఱుచుచుంట
నీవు పోఁకిన నెంతనీతిశాలికినైనఁ బుణ్యపాపవివేకబుద్ధి చెడుట


తే.

యెంచిచూచిన భూతము వీవు మదన, సంశయము లేదు శివుఁడు మోక్షప్రదాత
యతనిచే ద్రుంగియును ముక్తి నందలేక, గ్రహమ వైతివి విరహులకర్మవశత.

122