పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

సఖులమాటలకు వేసట నొందుచును శయ్యపై లేచి యఱుదుగాఁ బయిఁటఁజేర్చి
చెదరినకురు లొక్కచేఁ బట్టి సొగసు చా లని కొప్పు వలసి యొల్లమిని దుఱిమి
బరువంచు ముత్యాలుసరములు దివిచి చెంగట నున్నయింతిదోయిటను వైచి
వలదంచు గిలుకుపావా లవ్వలికిఁ ద్రోచి యలఁతిపాదుక లంఘ్రులందుఁ దొడిగి


తే.

యనుఁగునెచ్చెలి భుజము కరావలంబి, తంబుగా నూఁది కనకసౌధంబు డిగ్గి
యలపుసొలపున నసురుసురనుచు మంద, మందగతి నేగె వనమున కిందువదన.

98


క.

ఆరామలతాగృహమున, కారామ లతిప్రయత్నలై యరిగి రొగిం
దా రామలయజగంధిం, దారామలరుచినఖాళిఁ దగఁ దోడ్కొనుచున్.

99


వ.

అందు.

100


సీ.

రాజీవరాజీవరాజిరాజితములై కెలఁకుల కొలఁకులు దొలఁకుచోట
ఘనసారఘనసారఖను లైనఖనటచ్ఛదచ్ఛటాకదళికాతరులక్రేవ
సంతానసంతానసంతతాతాంతత శృంగారపాదపశ్రేణినడుమ
మాధుర్యమాధుర్యమధురసఫలగుచ్ఛవల్లులపందిటిచల్లనీడ


తే.

శీతకరశీతకరశిలాంచితవితర్ధి, సీమ సీమంతవతులు లేఁజిగురుశయ్య
నమర నమరకళావతివిధి వసింపఁ, జేసి చేసిరి సముచితశిశిరవిధులు.

101


సీ.

క్రొత్తగాఁ గురిసిన గొజ్జంగివిరిమంచు నీరు నెమ్మేనిపై నించినించి
బరువైన యనఁటికంబముల జాఱినయట్టి చంద్రరజంబు పైఁజల్లిచల్లి
శశికాంతపాత్రలఁ జలువటారుసుగంధ మవయవంబుల నిండ నలఁదియలఁది
పూఁదేనెవడియు నంబుజనాళహారంబు లురపుగా నుఱమున నుంచియుంచి


తే.

సరసనవ్యలామజ్జక జాలతాళ, వృంతములఁ జల్లగాడ్పురా విసరివిసరి
యూర్వశికిఁ బ్రాణసఖులు శైత్యోదయతకుఁ, జేసి రుపచారములు నేర్పుచేత నపుడు.

102


క.

ఏలాలవంగనవసుమ, నోలామజ్జకసుగంధనుతకర్పూర
శ్రీలలితమాధురీజల, మాలేమకుఁ గ్రోలనిచ్చి రతివలు మఱియున్.

103


సీ.

కలికిచన్నులమీఁద గర్పూర మిడుచు జంబీరఫలభ్రాంతి బెదరె నొకతె
పికవాణికురుల సంపెఁగదండ చుట్టుచుఁ జంచరీకభ్రాంతి జడిసె నొకతె
యింతికన్నులయందు హిమజలం బునుపుచు వికచాంబుజభ్రాంతి వెఱచె నొకతె
చెలిమోవి మధురాంబువు లొసంగుచును మధుసారపూరభ్రాంతి జంకె నొకతె


తే.

యతివ కుపచార మపచార మయ్యె ననుచుఁ, దావ మెచ్చుట కులికి సద్వస్తుఘటన
మానరుపమేయముల నుపమానములుగ, బ్రమసి ముగ్ధసఖుల్ తదంగములయందు.

104