పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాడుచున్నది కేళిహాళిఁ గోలాటంబు మంజుఘోషిణి లాస్యమందిరమునఁ
జలుపుచున్నది ప్రోడజాడల గొరపంజియల తిలోత్తమ నృత్యనిలయసీమ


తే.

నాటపాటల సభలోన సాటిచెలులు, మించు మెప్పించుకొన నభ్యసించువగలు
వింటివా తెల్పుచున్నది వెలఁదివితతి, మర్దళధ్వని తత్తత్క్రమంబు లెల్ల.

88


శా.

 నీసౌందర్యము నీవయోవిభవమున్ నీనృత్యగీతాదివి
ద్యాసంపత్తియుఁ జూచి యోర్వక యసూయల్ సేయు రంభాదు లు
ల్లాసంబందఁగ నేల యిట్లు విరహగ్లానిం గృశింపంగఁ జిం
తాసంతాపము మానవే చెలి మదిన్ ధైర్యంబు గీల్కొల్పవే.

89


వ.

అని యివ్విధంబున.

90


క.

అనునయ మొనరింపుచు సఖి, యనునయభాషలను జింతయాగక యాచ
క్కనిచెలువ పరితపించుట, కని చెలులు విచారహాతఁ గటకటపడుచున్.

91


వ.

తమలో నిట్లనిరి.

92


సీ.

కొమ్మచేతులు చూచి కుత్తుకబంటితో నున్నదిగాదె పయోజవనము
విమలాంగిమాటలు విని పండ్లుగొఱుకుచు నున్నది గాదె కీరోత్కరంబు
వనితచూపు దలంచి వైషమ్యగతి నున్నయదిగాదె మదనసాయకసమాజ
మతివయానము గాంచి యప్రియస్థితి నున్నయదిగాదె మఱి రాజహంసకులము


తే.

చలము సాధించ నిప్పుడే సమయ మనుచు, విప్రలంభభరంబున విహ్వలించు
వెలఁదిన లయించుచున్నది విషమసంధిఁ, గీడొనర్చుట హీనుల జాడగాదె.

93


ఉ.

తాపముచేతఁ జిక్కి వనితామణి జాఱిన చక్కనొత్తగా
నోపదు పయ్యెదన్ మగువ లొయ్యన గుబ్బలు గప్పరమ్మ జో
డై పొలుపారు జక్కవలయాకృతి నున్నవి శీతభానుఁ డా
శాపరిపూర్ణచంద్రికమిషంబునఁ జాలవిషంబు గ్రక్కెడున్.

94


ఉ.

ఏమి యుపాయమమ్మ యిఁక నిందులకో చెలికత్తెలార కాం
తామణిగాత్రహేమముదితం బగుఘర్మజలచ్ఛలంబునన్
గాముశరాగ్నికీలలను గ్రాఁగి కరంగి తొరంగెఁ జూడరే
యేమఱనేల చేయఁదగు నీయెడలన్ శిశిరోపచారముల్.

95


వ.

అని పలుకుచు.

96


తే.

ఉపవనచ్ఛాయ సంతాన ముడుపు ననెడు, భ్రాంతిఁ బొందింపఁ జెలులనిర్బంధమునను
రమణి నెమ్మది నుత్సాహరహిత యయ్యు, నంచితోద్యానసీమకు నరుగఁదలఁచి.

97