పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సుకుమారాంగి యటంచు జాలిపడు నాసుభ్రూసమాజంబునం
దొకప్రౌఢాంగన కూర్మిఁ జేరి పలికెన్ యోషిల్లలామంబుతోన్.

82


సీ.

వలపించుటే కాని వలచి దక్కవుగదా కుసుమబాణునికైనఁ గోమలాంగి
యోరకంటినె కాని తేఱిచూడవుగదా యలకళానిధినైన నలసగమన
వినయంబులే కాని చనువు వేడవుగదా దేవేంద్రునైన నిందీవరాక్షి
బయటిమాటలె కాని భావమియ్యవుకదా రాజరాజునకైన రాజవదన


తే.

చక్కఁదనముఁ గళావిశేషంబు విభవ, మును సిరియు నేకమూర్తి దాల్చినపురూర
వునిగుణమ్ములు గుణము లయ్యెనె లతాంగి, మరుఁ డురులు కొల్ప నీమనోమర్మములకు.

83


సీ.

కిన్నరస్వరలీల గేరునీగానవిద్యామాధురికి వీను లప్పగించి
ఱవికఁ బిక్కటములై కనబొల్చునీదుగుబ్బలకు భావంబులు పాలుపఱిచి
పైసోఁకు నీగీతపదరసవ్యంజకోజ్జ్వలదృష్టి కాస్యముల్ వశ మొనర్చి
యపరంజిపసిఁడిచాయల నీరుమైమెఱుంగులకుఁ గన్గవలు దక్కోలు చేసి


తే.

రక్తిఁ గడుజొక్కి చిత్తరుప్రతిమ లగుచు, నుండుదురు గాదె యింద్రాదు లోలతాంగి
కామతూర్యాయమానఘల్ఘలరవాంఘ్రి, వలయవై నీవు నాట్యంబు సలుపునపుడు.

84


మ.

సురవిద్యాధరసిద్ధసాధ్యఖగరక్షోయక్షగంధర్వఖే
చరనాగేంద్రకుమారవైభవవిలాసశ్రీల నింతైన రా
గరసంబందని నీదుచిత్తశశభృత్కాంతోపలం బీగతిం
గరఁగంజేసెనె రాజచంద్రుగుణరాకాచంద్రికల్ కోమలీ.

85


సీ.

ఉత్తుంగకుచకోకయుగళంబు దాకొన వదనేందుబింబంబు వ్రాల్చకమ్మ
చారులోచనసరోజంబులఁ జికురంపుటిరులు పైకొన జాఱనీకుమమ్మ
యధరంపులేఁజిగురాకుపై నుస్సున నెమ్మోముసెగగాడ్పు నించకమ్మ
తళుకొత్తు చెక్కుటద్దములపైఁ గన్నీటిచినుకులు రాలంగఁ జేయకమ్మ


తే.

రమ్యలావణ్యమౌక్తికరత్నరాశి, కలఘువిరహాగ్నిశిఖలు పైకొలుపకమ్మ
యువిద నీవిట్టు చేసిన నొకటికొకటి, వికటమయ్యెడు ధైర్యంబు విడువకమ్మ.

86


శా.

ధీరోదాత్తవు మాటనేర్పరివి బుద్ధిం బెద్ద వత్యంతగం
భీరస్వాంతపు దేవభోగవనితాబృందములో నెంతయుం
లేరౌ నాయకురాల వెంచఁదగు నీపెం పన్నిటం బ్రౌఢ వై
యీరీతి న్వగ నొంద నీకుఁ దగునా యిందీవరాభాలకా.

87


సీ.

నెఱపుచున్నది జక్కిణీలయల్ హొయలుగా శశిరేఖ నాటకశాలలోనఁ
జూపుచున్నది జోగిణీపంతు రంతుగా రంభ నాట్యగృహాతరంబునందు