పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

మది నంతంతకు నగ్గలించుబలుప్రేమం దాళరా దేమి సే
యుదు నేయత్నముచేత వశ్యుఁ డగు నాయుర్వీశుఁ డేనోము నో
ముదు నేదైవము వేఁడుకొందు నిఁక నీ మోహాబ్ధికిన్ మేర యె
య్యది నా కెవ్వరు ప్రాణబంధులు మదీయాసక్తి యీడేర్పఁగన్.

65


వ.

అని చింతింపుచు.

66


ఉ.

రేచితబాహ్యవృత్తిఁ గడురేచకపూరకకుంభకక్రియా
సూచన నూర్పుల న్నిడివిచొప్పడ వల్లభురూప మాత్మలోఁ
జూచుచుఁ దత్కథామధువచోజపశీలత నుండెఁ బుష్పనా
రాచగురూపదేశమున రాజనిభాస్య తదేకనిష్ఠతోన్.

67


వ.

అప్పుడు.

68


చ.

చిలుకలుతేరు మేల్ చెఱకుసింగిణి వాసనగుపవపూవుట
మ్ములపొది వాఁడిచెంగలువమొగ్గకటారి మీఁటారితేఁటికో
యిల గొరవంకపౌఁజు లెగనెత్తినపొంకపుమీనుడాలు పెం
పలర రతిప్రియుండు దివిజాంగన కుద్ధతి చూపె నయ్యెడన్.

69


క.

చెఱకువిలుకాఁడు కోమలి, యిఱుకుంజనుదోయినడిమియెద గుఱియిడి తాఁ
గఱకువిరిములుకు లేసెం, జుఱుకునఁ దనచేతిమేటిసూటిన్ ధాటిన్.

70


క.

మనసిజుశర మంటెను జెలి, చనుగొండలనడుమ నదియె శరగిరియోగం
బనిపించెఁ జెమటవానలు, పెనఁగొనునిట్టూర్పుగాడ్పు బిసబిస విసరన్.

71


మ.

జళిపించుంజిగురుంబిరంగి గదుమున్ ఛాత్కారధీరధ్వనుల్
చెలఁగం బచ్చనిఱెక్కజీన్పులుఁగుతేజిన్ హెచ్చరించున్ హళా
హళిగాఁ దుమ్మెదమూకలన్ విజయశీలాహంకృతిన్ హుంకృతుల్
సలుపుం గుండియ జల్లనన్ గలువనేజారౌతు హేమాంగిపైన్.

72


సీ.

నళినలోచనకుఁ బున్నమచందమామ లేయెండలు వేసంగియెండ లయ్యెఁ
గాంతకుఁ గలకంఠకంఠపంచమకుహూకారంబు గర్జావికార మయ్యె
విమలేందుముఖికి నవీనమైనకురంగనాభి యచ్చపువత్సనాభి యయ్యె
నరుణాధరకుఁ జందనాచలాగతగంధవాహంబు గరళప్రవాహ మయ్యె


తే.

లలనకు రసాలశాఖాచలప్రవాళ, పాళి జాజ్వల్యమానదీపాళి యయ్యె
ముద్దుగుమ్మకు నీచందమునఁ బ్రమోద, కరము లెల్ల మనోవ్యథాకరము లయ్యె.

73


ఉ.

ఆరుచిరాంగికి న్మధుకరాళి శిలీముఖపఙ్క్తి యయ్యెఁ బ
న్నీరు శరౌఘు మయ్యెఁ దరుణీమణికిన్ మలయానిలంబు నిం