పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఊర్వశి ధరణి కవతరించి శాపతప్తురా లయ్యెను. శాపఫలము భూలోకమున వసించుట. ఊర్వశికిఁ దీర్థము స్వార్ధము గలసివచ్చింది. తరువాత నీయిరువురికలయిక (సమావేశము) సందర్భశుద్ధిగ సరసముగ రసవత్తరముగఁ గవి చిత్రించినాఁడు. ఈయుభయులప్రేమ నిష్కళంక మైనదె. ఏకహృదయముగ నిరువురు వర్తించుచుండిరి. కాని యిరువురు విడిపోవుట కొకసమయము గలదు. ఊర్వశి రెండుపొట్టేళ్లఁ దెచ్చినది. వానిని మృగచోరాద్యాపదలు బొరయనీయక కాపాడుట, వివస్త్రముగ దనకుఁ బురూరవుఁడు కనపడకుంట జరుపువఱకు ఊర్వశి వెంటనుండును. ఈనియతికి భంగముకలుగుటయే యెడబాటు. నియమముల కంగీకరించి పురూరవుఁడు ఊర్వశిని బరిగ్రహించి ప్రతిష్టానపురము జేరి చిరకాలము కామసౌఖ్యము లనుభవించెను. ఒకదినము తగళ్లం జోరులు హరించిరి. వివస్త్రముగ నేగుచున్నపురూరవుని దర్శించుటతో నిరువురిబంధము తెగిపోయెను. ప్రతిజ్ఞాభంగము జ్ఞాపకముజేసి ఊర్వశి స్వర్గలోకమునకుఁ బోయెను, అటనుండి విప్రలంభశృంగారము మనోహరముగ నున్నది. ఈ కథాభాగముల నైదవయాశ్వాసమునఁ గాంచనగును.

ఊర్వశి నిర్గమనానంతరము పురూరవుఁడు వలపువ్రేగునఁ జింతించుచు గంధర్వులఁ బ్రార్థింప ఊర్వశివలె అగ్నిస్థాలి యనుకన్యను సృజించి యొసంగుదురు. క్రమముగా నాయమ యూర్వశి కాదని పురూరవుఁ డెఱింగి యేకతమునఁ జింతించుచు రెండరణుల సేకరించి యొకటి యూర్వశియని మఱియొకటి పురూరవుఁడని పేర్కొని రెంటిని త్రచ్చుచుండ విష్ణువు ప్రత్యక్షమై కామితములు ప్రసాదించుటతోఁ గథ యంతమగుచున్నది. కథాంశమునకుఁ గవి సంస్కరణ జరుపక గనిలోనుండి తీసినపుట్టుశిలవలెఁ గథనుంచి వర్ణనము పేర నెన్నేని భూషణము లాశిలకే కూర్చినాఁడు. మూడవయాశ్వాసమునుండియే యీప్రబంధమునకుఁ బ్రధానకథ యారంభమగుచున్నది. ఇందలిశృంగారము చాలవఱకు