పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

"కొండఁట విల్లు వేదలలకుండలిరాజఁట నారి యమ్మనం
గుండఁట బైటిపల్లియల దున్మినవాఁడఁట యొండు రెండు భ
ర్గుండిది నిండు పౌరుషమొకో యని గెల్వవె ముజ్జగంబు లు
ద్దండత నొక్కతుంటవిలు దాలిచి యంటినగందుతూపులన్.”

వసుచరిత్రము


ఉ.

"నారఁట తేఁటి, జోక నలినారఁట, తేరఁట చిల్క సౌరభో
ద్గారఁట విల్లుపూతనయగారఁట చుట్టము శైత్యపున్ సదా
చారఁట కమ్మగట్టు పరిచారఁట కోయిల కేతనీభవ
ద్వారఁట యిట్టినీకొదుగువారఁట లోకు లిదేమిచిత్రమో.”

కవిరాజమనోంజనము

అనుకరణపద్యమున సంధిలోపములు చాలగలవు. గ్రంథవిస్తరభీతిచే నిం దుదాహరింప మానితిమి. కవిరాజమనోరంజనమున, రసవత్తరము లగుఘట్టము లెన్నేని కలవు. మొదటియాశ్వాసములోని రాజనీతులు ఆత్మవిద్యోపదేశము, ప్రత్యేకపఠనీయములు. రెండవయాశ్వాసములోని తారాశశాంకసమాగమముగ సభ్యముగ సంగ్రహరూపముగ నుండి దుర్నీతిని బరిహరించుచున్నది. వసిష్ఠస్తుతి కవికిఁగల యుభయభాషాకవితానైపుణ్యమునకుఁ దార్కాణగా నున్నది. ఇలాకన్య పురుషుఁ డగుటయు రాజకుమారుఁడు స్త్రీ యగుటయు వీరలు పరస్పరము మోహించుకొనుటయు నిరువురకుఁ దనయుం డుదయించుటయు శివానుగ్రహంబునఁ బూర్వరూపంబులు దాల్చుటయు మిగుల మనోహరముగ రెండవయాశ్వాసమున వర్ణింపఁబడినది. మూఁడవయాశ్వాసమునుండి ప్రధానకథ యగుపురూరవశ్చరిత్ర మారంభమైనది. ఊర్వశీపురూరవుల సమాగమమునకుఁ గాంక్షించుట, మలయానిలాద్యుపాలంభములు చెలికత్తియల యోదార్పులు మున్నగు కథాభాగములు విశేషభావసమన్వితము లై మనోహరముగ నున్నవి. ఊర్వశీపురూరవుల కీయాశ్వాసమున వలపు మొలక లెత్తినది. సమాగమవిధము నాల్గవయాశ్వాసమునఁ గలదు. మైత్రావరుణుల తపోభంగము గావింప నింద్రుపంపున