పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కామునిబాణముల్ నిరవకాశముగా సురకామినీమన
స్సీమలఁ బర్వుచున్ గటికచీఁకటి గ్రమ్మఁగఁ జేసెఁ దచ్ఛర
స్తోమ మసంఖ్యమై మదికిఁ దోఁచఁగ నారతిజాని కయ్యజుం
డేమి దలంచి చేసెనొ సుమీ మును పంచశరాభిధానమున్.

46


వ.

అట్టియెడ.

47


సీ.

అతనిబింబాధరం బందనిమ్రానిపండని విచారించె మదాలసాఖ్య
యతనిచేసోఁకుసయ్యాట లేటావలిగిలిగింత లని వితర్కించె రంభ
యతనితాంబూలగంధాస్యాప్తి యేనుఁగుమీఁదిసున్నం బని మేన యెంచె
నతనికృపారసామృతవృష్టి పెదగంగయుదక మంచు ఘృతాచి మదిఁ దలంచె


తే.

జనమనోరమ ధ్యానమాలినిఁ గళావ, తియుఁ దిలోత్తమ పూర్వచిత్తియుఁ బ్రమోహి
మొదలుగా నింతులకుఁ జింతయొదవె నతని, చిత్త మది గట్టుచాటునిక్షేప మనుచు.

48


క.

ఆవిభుసర్వోత్కర్షత, భావింపఁ దదాప్తి దుర్లభంబని తచ్ఛం
కావిర్భవదురునిశ్వస, నావధికప్రేమ లైరి యమరలతాంగుల్.

49


వ.

వారిలోన.

50


సీ.

పుట్టినయి ల్లేప్రపూర్ణేందుముఖికిని నారాయణస్వామియూరుసీమ
నాట్యవేదార్థంబునకు నేకళావతి లాస్యనిరూఢి కూలంకషంబు
ప్రథమబహూకారపాత్రలలోన నేయి౦తి హరిహరాజేంద్రసభలఁ
కారణం బేహంసగమనరూప మరుంధతీమనోహరుపునర్దేహలబ్ధి


తే.

కట్టి యూర్వసి భువనమోహనవిలాస, నిజకటాక్షపరంపరావిజితకుసుమ
ధన్వచార్వసిసౌమ్యనందనకథాసు, ధార్ణవాంతర్నిమగ్నాంతరంగ యగుచు.

51


ఉ.

అన్నరనాథుచక్కఁదన మాధరణీశ్వరుభోగభాగ్యసం
పన్నత యమ్మహామహునిప్రాజ్ఞత యవ్విభుధైర్యవిక్రమా
భ్యున్నతి దేవమౌని సరసోక్తులఁ గర్ణరసాయనంబుగా
విన్నది యాదిగాఁగ నళివేణికిఁ గన్నులఁ గట్టినట్ల యై.

52

ఊర్వసి పూరూరవుని విరాళిగొనుట

క.

అతనివిలాసగుణాదులు, మతి దలఁపుచు మోహజలధిమగ్నతచేఁ ద
ద్గతమానసయై వేలుపు, లతకూన వియోగవిప్రలంభము నొందెన్.

53


తే.

కలికిడెందంపుబాదున మొలచి కొనలు, సాఁగి సంకల్పలతలు సంజాతపులక
ఘర్మజలబిందుమిషమునఁ గానిపించె, బల్లవితకోరకితలక్ష్మి బయలు మెఱసి.

54


వ.

తదనంతరంబ.

55