పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

సకృదుపదేశమాత్రమున సద్గురుసన్నిధిఁ బ్రాగధీతవి
ద్యకరణి నప్పగించునె కదా మఱి యెన్నఁటికైన విస్మృతం
బొకయెడనైన లేదు చతురుత్తరషష్టికళాకలాపసా
ధకుఁడయి యొప్పెఁ దద్గ్రహణధారణశక్తి వచింప శక్యమే.

239


మ.

హరిహస్తిప్రముఖావరోహణము దివ్యాస్త్రప్రయోగోపనం
హరణప్రౌఢి గదాదిసాధనఘనాభ్యాసంబు సారస్వతా
కరవాగ్వృత్తి యుపాయసప్తకచమత్కారంబు షాద్గుణ్యవి
స్ఫురణం బాదిగ నన్నిటం జతురుఁడై శోభిల్లె నుద్యన్మతిన్.

240


చ.

సకలగుణప్రవీణత రసజ్ఞశిఖామణి యైనరాకుమా
రకుహృదయాంబుజం బనితరప్రతిపాదకవిష్ణుభక్తి నై
ష్ఠికయుతమయ్యె మేలిమిపసిండికి నవ్యవికాసపారిజా
తకుసుమగంధ మబ్బినవిధంబున నాతనిభాగ్య మెట్టిదో.

241


వ.

మఱియు నప్పరమయోగిపరివృఢుం డతనికి నఖిలజగత్సంచారసామర్థ్యంబును
నసాధారణపరాక్రమంబును నక్షీణభుజావష్టంభంబును నక్షయతూణీరంబులును నభే
ద్యకవచంబును నవధ్యరథ్యాదిసమృద్ధరథంబును నణిమాద్యష్టసిద్ధులును మొదలుగాఁగల
విశేషంబులు ప్రసాదించి మఱియు నతిరహస్యంబులైన మణిమంత్రసిద్ధక్రియాకలా
పంబు లెఱింగించి నిజాశ్రమంబునకుం బోవం దలంచి తనకుఁ గృతప్రణాము లైన
వైవస్వతసుద్యుమ్నుల సబహుమానంబుగా నాదరించి యనంతరంబ.

242


క.

తనపాదములకు వందన, మొనరించిన సంతసంబు నొందుచు సుఖివై
మను మను మని మనువుననుఁగు, మనుమని దీవించి యరిగె మౌని నిజేచ్ఛన్.

243


క.

అనిన విని శౌనకాదులు, వినయంబున సూతుఁ గని సవిస్మయభంగిన్
వినిపింపు మనంతరకథ, యనుచు సముత్సుకమనస్కులై యడుగుటయున్.

244


శా.

రక్షోశిక్షణదక్ష దక్షిణభూజాగ్రక్షిప్రకౌక్షేయకా
మోక్షాపేక్షకరక్షణాక్షయకృపామోఘేక్షణాలక్షణా
వీక్షాలక్ష్యసులక్షణావయవద్రాక్షేక్షుద్రవాక్షేపకా
ర్యక్షుద్రోక్తిచయక్షమారమణ అక్షాధ్యక్షపక్షిధ్వజా.

245


క.

భద్రాకుచమకరీదళ, ముద్రాంకితచారువక్ష మోక్షాధ్యక్షా
భద్రాకరకారుణ్యస, ముద్రా రుద్రాభినంద్య మునిజనవంద్యా.

246