పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యక్కుమారకుం బిలిపించి తనసమీపంబున నాసీనుంజేసి సాముద్రికచిహ్నంబు
లుపలక్షించి యి ట్లనియె.

229


సీ.

రత్నగర్భకు వీనిరాజితాజానుబాహాస్తంభసీమ నిత్యాశ్రయంబు
వాగ్వధూటికి వీనివ్యాకోచహల్లకనవ్యజిహ్వాగ్రంబు నాట్యశాల
చింతామణికి వీనిప్రాంతరక్తవిశాలసుందరాక్షులు కేళిమందిరములు
స్పర్శవేదికి వీనిభవ్యరేఖాశ్రయశయకుశేశయపాళి జన్మభూమి


తే.

సకలసౌభాగ్యలక్షణస్వచ్ఛమైన, వీనినెమ్మేను లక్ష్మికి విడిదిపట్ట
వీనిసద్గుణసంపూర్ణవిమలహృదయ, నలినకర్ణిక సింహాసనంబు హరికి.

230


శా.

నానాద్వీపనృపాలమౌళి నవరత్నస్నిగ్ధకోటీరశో
భానీరాజతరాజితంబు లగునీపాదంబులందు న్నవ
శ్రీనిత్యధ్వజవజ్రశంఖహలరాజీవాదితద్రక్తరే
ఖానీకంబు కుమారశేఖరుభవిష్యద్భాగ్యముం దెల్పెడున్.

231


చ.

ఇతఁ డుదయించువేళ నమరేంద్రగురుప్రముఖగ్రహంబు లా
తతకళల న్వెలుంగుహిమధామునిఁ జూచుచునుంటఁ జేసి ని
ర్జితరిపుఁడై ధరాస్థలమశేషము నేలెడు సార్వభౌముఁడై
యతులితకీర్తి నొప్పెడు మహావిభవంబునఁ బెక్కువర్షముల్.

232


క.

అని పలికిన విని తనమన, మునఁ బెనఁగొను మోదమునను మునిపతితో న
మ్మనుజపతి యనియె వినయం, బెనయన న్మృదువచనరచన యింపొదవింపన్.

233


తే.

శిష్యవాత్సల్యమున మీరు చేసినట్టి, యత్నమునఁ జేసి యీడేఱె నన్నిపనులు
నిట్టిశ్రేయస్కరములకు హేతుకంబు, మీయనుగ్రహమహిమగాదే యమీంద్ర.

234


వ.

అని మఱియు ని ట్లనియె.

235


క.

మీయుపదేశంబున నితఁ, డాయతమతి సకలవిద్యలందు ధురీణుం
డై యొప్పు నట్లు సదయో, పాయత నొనరింపవలయు నభ్యసనంబున్.

236


క.

అని ప్రార్థించిన మంచిది, యని రాజకుమారకునకు సాంగంబుగ న
మ్మునిశేఖరుఁ డుపదేశం, బొనరించి సమస్తవిద్య లుద్యత్ప్రీతిన్.

237


మ.

అమర న్నేతకు ఋగ్యజుస్సులును సామాధర్వణంబు ల్నిరు
క్తము ఛందంబును జ్యోతిషంబు మఱి శిక్షా కల్పముల్ శబ్దశా
స్త్రము మీమాంసపురాణసంహితలు ధర్మన్యాయశాస్త్రంబు లా
దిమవిద్యల్ పదునాలుగుం జతురుపాధిప్రౌఢి నభ్యస్త మై.

238