పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

రూపరేఖాజితప్రద్యుమ్నుం డగుసుద్యుమ్నుని నిజవదనచంద్రచంద్రికావికసిత
జగజ్జననయనకైరవుం బురూరవుం దోడుకొని ప్రతిష్టానపురంబున కరుగుదెంచు
చుండె నవ్వార్త చారులవలన వినినవాఁడై వైవస్వతవసుంధరావల్లభుం డుల్లాసంబున
నుల్లంబు పల్లవింప బురంబు శృంగారింపం బరిచారకుల నియోగించిన వారును
సంభమంబున నానావిధశృంగారరచనల నపూర్వవిలాసంబుగా నగరం బలంకరించి
రప్పుడు.

214


సీ.

పొసఁగుపన్నీటిపొల్పున జొబ్బిలనివీథి పచ్చికస్తురి నల్కఁబడనియరుగు
వెడఁదముత్యముల మ్రుగ్గిడనిముంగిలి కల్పసూనతోరణలబ్ధిలేనివాకి
లాటపాటలయింపు లమరనిసభ మహోత్సవముసేయని దేవతాగృహంబు
నగరుధూపపుఁదావు లతిశయింపనిచో టశేషవస్తువుల రాజిలనివిపణి


తే.

నూతనాలంకృతులను మనోజ్ఞరూప, వైభవులు గాని పురుషుండు వనజముఖియు
వెదకినను గానఁబడుటగల్గదు తదీయ, నగరశృంగారరచన లెన్నఁగఁ దరంబె.

215


చ.

అరయ నిసర్గసుందరతరావయవోజ్జ్వల యైనపాటలా
ధర కుసుమాంబరాభరణధారిణియై మిగులన్వెలుంగు న
ట్లురుతరనిత్యవైభవసమున్నతమయ్యుఁ బురంబు నవ్యమై
కరము రహించెఁ దత్సమయకల్పిత మైనయలంకృతంబులన్.

216


వ.

ఇవ్విధంబున.

217


మ.

నగరాలంకృతి లోచనంబులకు నానందం బొనర్పంగ న
జ్జగతీనాథుఁ డమాత్యభూసురసుహృత్సంయుక్తుఁ డై యాభిము
ఖ్యగతిం బోయి యరుంధతీరమణుపాదాంభోరుహద్వంద్వముం
దగఁ బూజించె నిజోత్తమాంగమకుటోద్యద్రత్నకాంతిచ్ఛటన్.

218


వ.

అప్పుడు.

219


మ.

ఎలమిం బొంది మునీంద్రశేఖరుఁడు రాజేంద్రుం గృపాబుద్ధి సం
ధిల భద్రాణి భవంతుతే యని తగన్ దీవించి తత్పుత్రపౌ
త్రల సుద్యుమ్నపురూరవస్సులను సంతోషస్థితిం జూపి సా
గిలి మ్రొక్కించిన నానృపాలుఁ డనురక్తిం గౌఁగిటం జేర్చుచున్.

220


ఉ.

హర్షవికాసమానహృదయాంబుజుఁ డయ్యె ననంతరంబ బ్ర
హ్మర్షిసమేతు లందఱు సమగ్రశతాంగము లెక్కి వైభవో