పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భంగురపతంగశశిసంగతరథాంగ సదపాంగ శుభలింగ గిరిశృంగగృహ గంగా
తుంగతరభంగచయసంగ మపరాంగ హృదయంగమ మతంగమతిచంగసుమభృంగా.

205


లయవిభాతి.

భుజగకరవలయ వరరజతగిరినిలయ పదసృజితభరతలయ రణవిజయ భుజదండా
ఋజుసరసహసన లసదజినకృతవసన ముఖవిజితశశిలసన రచితజలభవజాండా
త్రిజగదనుభరణ సురభజితమృదుచరణ మదగజదనుజహరణ సరసిజనయనకాండా
ప్రజవవృషగమన ఘనవృజినచయదమన కృతసుజనభయశమన ధృతరజనికరఖండా.

206


చ.

అనుచు ననేకభంగుల నయం బెనయం బెనఁగొన్నభక్తిచే
వినుతులుసేయుమౌనిఁ గని విశ్వగురుండు హరుండు సుందరా
ననదరహాసచంద్రికలు నైజికటాక్షదయాసుధారసం
బున కనురూపమై మదికపూర్వముదం బొదవింప నిట్లనున్.

207


శా.

నీసంకల్ప మెఱుంగుదు న్వినుము మౌనిశ్రేష్ఠ హేలావతీ
త్వాసంగాకృతి నున్న రాసుతుని బుంస్త్వాకారసంప్రాప్తికై
యాసక్తి న్మముఁగోరి వేఁడెదు మదీయాజ్ఞోక్తి యట్లుంటఁ గా
దా సుద్యుమ్నుఁడు పౌరుషంబెడలి కాంతారూప మయ్యె న్వనిన్.

208


ఉ.

మావచనం బమోఘ మదిమాన్పుట గల్గదు నీయెడం బ్రస
న్నావహమయ్యె మాహృదయ మట్లగుటన్ భవదిష్టసిద్ధియుం
గావలనె న్మునీంద్ర యటుగావునఁ దా నుభయార్థసాధకం
బై వెలయంగ వేఱొకయుపాయ మొనర్చెద నేర్పు పెంపునన్.

209


క.

పురుషుండై యొకమాసము, ధరణీసామ్రాజ్యభారదక్షత నుండుం
దరుణీమణియై మాసాం, తరమున వర్తించు నిట్లు తప్పక నడచున్.

210


వ.

అని ఇవ్విధంబున.

211


క.

మగరూపు నాఁడురూపును, సుగుణస్థితి దాల్చుహరుఁడు సుద్యుమ్నునకున్
మగరూపు నాఁడురూపును, దగనొసఁగి వసిష్ఠవందితపదాంబుజుఁ డై.

212


శా.

అంతర్ధానము నొందె నంతఁ బరమేశానుజ్ఞచే నయ్యిలా
కాంతారూపము పౌరుషాకృతి వెలుంగంజూచి చిత్తంబునన్
వింతంబొందుచు నున్నసౌమ్యునకుఁ దద్వృత్తాంతముందెల్పి ని
శ్చింతుం జేసి యరుంధతీవిభుఁడు దాక్షిణ్యంబు సంధిల్లఁగన్.

213