పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పత్సముపేతలీల నయపద్ధతి నేలఁగలం డనేకసం
వత్సరము ల్సుధాంశుకులవర్ధనుఁడై జనలోక మంతయున్.

188


క.

అని నిర్ణయించి మిక్కిలి, యనురాగముతోడ మంగళాశాసన మిం
పొనరఁగ జేసి పురూ, రవుఁ డనియభిధానం బొనర్చి రబ్బాలునకున్.

189


సీ.

పాలుబ్బు బిగువుగుబ్బల నెమ్మొనలఠీవి పసపంటుపయ్యెదపై నటింపఁ
గాయంపుముద్దల కారంపుఁదావు లాస్యనిసర్గవాసన నలమికొనఁగ
నడుమున దిటముగా వడిఁ జుట్టికట్టిన బంగారుమైజారుకొంగు దనర
నుల్లిపూసలపేరు హరుమంజిముత్యాలకుతికంటు దాపునఁ గొమరు మిగులఁ


తే.

బ్రసవసమయపరిశ్రాంతి బడలియున్న, యంగకముల నొకవింతయంద మెసగ
జూడఁ దగియుండె నప్పుడాసుదతియందు, లాలితంబైన బాలెంతరాలితనము.

190


సీ.

అర్ధక్షణంబైన నంతరాయములేని కౌఁగిలి యత్నసంఘటిత మయ్యుఁ
గుచపీడనంబు చేకొలఁదిసారెకుఁ జేయు మమతహస్తస్పర్శమాత్రమయ్యుఁ
గపురవిడ్యపుఁదావి గ్రమ్ముచుంబనలబ్ధి కటువస్తుపరిమళకలితమయ్యు
ఘటచక్రపుంభావనటనలఁ జూపునేర్పులకు జోక్కుట లపరూపమయ్యు


తే.

నతనిహృదయంబు పూర్వహర్షానుభవతఁ, బొదలె బాలెంతరాలిసంభోగకేళి
నలవియే యెంచఁ బ్రసవితానంతరద్వి, తీయమాససమాగమాధిక్యసుఖము.

191


క.

ఈకరణి మఱియుఁగొన్నా, ళ్లాకరభనిభోరుఁ గూడి యతిశయసమ్మో
దాకరవిహారగతుల సు, ధాకరనందనుఁడు మెలఁగు తత్సమయమునన్.

192


చ.

ప్రతిదినవర్ధమానసితపక్షకళానిధికైవడిం బ్రవ
ర్తితరమణీయశైశవశరీరవిరాజితుఁడై విభూపణ
ద్యుతి యతిచిత్రమై వెలుఁగుచుండ జగజ్జనలోచనోత్సవ
స్థితిఁ దనరెం బురూరవుఁ డశేషవిశేషగుణాభిరాముఁ డై.

193


వ.

అంత.

194


క.

తనయాకృతి వితతామో, దనిదానంబయ్యు నపుడు తరుణీమణికిం
దనయాకృతి వితతా మోద,నిదానంబయ్యె నది యథార్థముగాదే.

195


చ.

కతిపయివాసరంబు లరుగన్ భ్రమరాలక యొక్కనాఁడు కు
త్సితమగునాత్మవర్తనము చిత్తమునం దలపోసి రోసి దుః
ఖత యగుచుం దలంచి మదిఁ గేవలయోగసమాధినిష్ఠ నూ
ర్జితకరుణాదిసద్గుణగరిష్ఠు వరిష్ఠు వసిష్ఠు నయ్యెడన్.

196