పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చెక్కులతెలుపును జిగిచను, ముక్కులనలుపును నపాంగములఁ దేలికతా
దృక్కులసొలపును నెడనెడ, వాక్కులయలపును ఘటిల్లె వనితామణికిన్.

180


ఉ.

కేలితమిం జెలంగి తమకించి నిజోద్ధతిఁజూపఁ జూచు న
వ్వేళఁ బ్రశాంతుఁ జేయు నరదిందనిభానన కుంచితాంచిత
భ్రూలతికావిలాసమునఁ బొల్పుకనుంగవమోడ్పుతోడ గ
ర్భాలసజాతశీత్కృతిరవాననపద్మము ప్రాణనాయకున్.

181


ఉ.

రావె కృశోదరీ యనుచుఁ రాగదవే తనుమధ్యయంచు హే
లావతు లెక్కసక్కె మగులాగనఁ బల్క శిరంబువాంచు ల
జ్జావశమందహాసవిలసన్ముఖయై జఠరావలగ్నభా
గావహవిస్తరంబు తెలియం గను భంగి లతాంగి యయ్యెడన్.

182


సీ.

దృఢసంపదల కింకఁ దిరుగుఁబాటనియొ స్తనంబులముఖములు నల్లనయ్యె
జిగిబిగి పరిపాటి యగు నింకననియో తనూలత చంచలానూపమయ్యెఁ
గళపెంపు మట్టుగాఁ గలదింక ననియొ ముఖాబ్జంబు వెలవెల్లనై యెసంగెఁ
గ్రొవ్వాఁడితనమింకఁ గొలఁదియౌ ననియొ దృగంచలం బలసావికాసమయ్యె


తే.

నెపుడుఁ బతిప్రక్కఁబాయనియెలమికలిమి,యెడ నెడలఁగాని లభింప దింకననియొ
యంతరంగంబు మిగలజాడ్యంబు నొందె, సతికి గర్భంబు వర్ధిల్లు సమయమునను.

183


వ.

అంత.

184


క.

నవమాసానంతరమున, నవమోహనగాత్రి గాంచె నందను రాకా
ధవళకరుం బ్రథమదిశా, కువలయదళనేత్ర గాంచుకొమ రమరంగన్.

185


శా.

సూచించెం బరమోచ్ఛభాగవిహరత్సువ్యక్తవర్గోత్తమ
ప్రాచుర్యోచితదృక్సమేతశుభదారంభగ్రహానుగ్రహం
బాచక్రాచలధారుణీవలయరాజ్యశ్రీయుతైశ్వర్యవి
ద్యాచాతుర్యగుణాదిభావిఫలముల్ తజ్జన్మకాలంబునన్.

186


మ.

గణనాతీతవిశేషలీలఁ గురిసెన్ గంధర్వగీర్వాణచా
రణవిద్యాధరదంపతిప్రకరనిర్యత్పుష్పవర్షప్రక
ర్షణ మబ్బాలకుఁ డుద్భవింపఁగ సమస్తక్షోణిరక్షావిచ
క్షణదీక్షారచితాభిషేకదినిషద్గంగాంబుధారాకృతిన్.

187


ఉ.

తత్సమయంబునం బుధుఁ డుదారముదావహచిత్తవృత్తిఁ బు
త్రోత్సవకృత్యముల్ నడపె యోగిజనంబు లితం డఖండసం