పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అని వనితాలలామయు నిజాభిమతానుగుణంబుగాఁగఁ బ
ల్కినపలుకు ల్సుధారసములీల శ్రుతిద్వితయంబు నిండి నె
మ్మనమున సంప్రకాశమగు మన్మథతాపము చల్లచేయ న
వ్వనరుహనేత్రఁ జేరి రతివాంఛలు లోపలఁ జౌకళింపఁగన్.

170


క.

భృంగీసంగీతస్వన, మాంగళ్యసుగంధకుసుమమంజరులు బయల్
పొంగుమరందము నెపమున, శృంగారరసంబు గ్రుమ్మరిలుపొదరింటన్.

171


మ.

వనితం గౌఁగిటఁ జేర్చి బింబఫలనవ్యం బైనకెమ్మావి ప
ల్మొనల న్నొక్కుచుఁ జెక్కుటద్దము లొగి న్ముద్దాడుచు న్మోహన
స్తనకుంభంబుల నెమ్మొనల్ పుణుకుచున్ సంభోగచాతుర్యఖే
లనుఁడై సల్పె రతిప్రసంగము మహోల్లాసంబు సంధిల్లఁగన్.

172


క.

ఆయింతిమదనుపాళెము, నాయతమతి గొల్లకొనఁగ నతనుం డబలుం
డై యొదిఁగె వగరుదోఁచఁగ, నాయఁడు పొంచుండు ననుట నైజము గాఁగన్.

173


చ.

కటకట వెన్నవంటికలకంఠిమనం బొకరాయి చేసి మి
క్కుట మగుచన్నుదోయిపయి కొంగయినం బతి నంటనీక య
ట్టిటుఁ బెనఁగించుకూళతన మెక్కడఁబోయెనొ కాని సిగ్గుతా
గిటగిటమంచుఁ గొమ్మకనుఁగ్రేవలఁ జేరఁ దుది న్విభుండు ము
చ్చట తమిరేఁచి లోఁఱిచి జవ్వనమెల్లను జూఱలాడఁగన్.

174


సీ.

సొగసుఁ బల్మొనగంటు చుఱు కెఱుంగఁగరాని పెదవులయమృతంపుఁబీల్పుసొక్కు
తారహారములయొత్తడ మెఱుంగఁగరాని పరిరంభములప్రేమపరవశంబు
గిలిగింత యళ్కుబెళ్కు లెఱుంగఁగారాని మర్మసంస్పర్శనామందసుఖము
సిగ్గుపోకడమాట యెగ్గెఱుంగగరాని తమి హెచ్చరింపువాక్యములముంపు


తే.

ముదురుఁదమకంపుఁ గలయిక నొదవునలయి, కల నెఱుఁగఁగరాని యగ్గలపుఁగళల
యబ్బు నుబ్బువినోదమై యొనరె నపుడు, సమరతిక్రీడ రమణికి రమణునకును.

175


తే.

ఇవ్విధంబున జవ్వని నవ్వనిం బ్ర, గాఢమోహాప్తిఁ గొన్నాళ్లు కలసిమెలసి
మకరకేతనవుజ్యసామ్రాజ్యపదవి, కెలమి మూర్థాభిషిక్తుఁడై యేలుచుండె.

176


తే.

అతనికన్యాసమాగమస్థితి తదీయ, మిథునవర్తనమునుఁ బెంపు మిగిలియుండె
బుధునికన్యాసమాగమమిథునవర్త, నములు పెంపువహించుట నైజమకద.

177


వ.

ఆసమయంబున.

178


క.

ముక్తామణిభరణాంచిత, శుక్తిప్రతిమాన మగుచు సుదతీమణికిన్
నక్తంకరజాతకళా, యుక్తంబై గర్భమమరె నుజ్జ్వలలీలన్.

179