పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

మదనచంద్రవనప్రియమలయపవన, నిగ్రహంబులు తలఁప ననుగ్రహంబు
లౌఁగదా నీకృపాప్రసాదాస్తి నిట్టి, రూపముల రాజహంసానురూపగమన.

161


తే.

కలిమి కొండంత కలిగియుఁ గఠినరీతి, నర్థికిని మేలుచూపక యకట బయటి
గమకముల నాసకొల్పెడుఁ గలికి నీదు, చన్నుఁగవ లోభిదొరల దీచంద మనఁగ.

162


మ.

ఎలనాఁగా మదనాగ్ని వేఁగెడు నయో యీమేను గుత్తంపుఁగ్రొం
జిలుఁగుంబట్టుచొ కాటపున్రవికలోఁ జెల్వై సెగల్దేరు నీ
బలుపుంజన్గవ నొత్తి పట్టఁగదె నాపై నుష్టముష్ణేన శీ
తలమంచున్ బుధకోటి పల్కుగతి సంతాపంబు చల్లాఱగన్.

163


శా.

నిన్నుం జూచినవేళనుండి తరుణీ నీరూపరేఖావిలా
సౌన్నత్యంబులు నామదిం దగిలి మోహభ్రాంతిపాలైతిఁ జం
చన్నీలోత్పలబాణవృష్టిని రణఝ్ఝంకారటంకారసం
పన్నాభంగురభృంగమార్వి నటియింపం గమ్మవి ల్వంచి ముం
చె న్నించె న్నిజశాంబరీతమము రాజీవధ్వజుం డియ్యెడన్.

164


క.

బాలిక శకలితశశిబిం, బాలిక శుకశారికాదికాంగజసేనా
కోలాహలంబు చెవులకు, హాలాహల మగుచు మిగుల నలయించెఁగదే.

165


క.

అని యిట్లు పలుకుశశినం, దనుమోమున కతివ కులుకుతళుకుబెళుకువా
ల్గనుఁగొనల సిగ్గుఁ బ్రేమయుఁ, నెనసినచూపుల నివాళు లిడుచుం బలికెన్.

166


తే.

రాజనందన జితరతిరాజరాజ, రాజనందన విను మేను రాజకన్య
నీశ్వరానుగ్రహంబున నివ్విధమున, సంచరించెద నివ్వనస్థలులయందు.

167


సీ.

స్వాభావ్యమందహాసచ్ఛలంబునఁ బూర్ణహరిణాంకు నవ్వు నీయాననంబు
నైసర్గికాంతారుణవ్యాజమునఁ దమ్మిగములపైఁ గినియు నీకన్నుదోయి
సహజోర్ధ్వరేఖామిషమునఁ గెంజిగురులపై ధ్వజంబెత్తు నీపదయుగంబు
నిజభూషణమునఁ గరికరనికరంబు నదలించు నీభుజంబు


తే.

లిట్టినీచక్కఁదనము పూర్ణేందుబింబ, వదనలకు సాత్త్వికోదయాస్పదము కాదె
కమలభవురచనాచమత్కారమునకు, నరయఁ గూలంకషముగాదె యలఘుచరిత.

168


చ.

మదనవిలాసినీనిరుపమానమనోహరమూర్తిఁ జూచి నా
హృదయము చంద్రకాంతమణి యిందుకరాప్తిఁ గరంగనట్లు స
మ్మదరసపూరమయ్యె ననుమానము సేయక యేలుకొమ్ము పెం
పొదవఁ గవుంగిలించి చిగురొత్తినకోర్కులకున్ ఫలంబుగన్.

169