పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వనిత వీవాలుగన్నులు వలుదకొప్పు, మందగమనంబు సారంగమహిమఁ గాంచుఁ
గలికి నీమోముఁ జక్కనికరయుగంబు, మఱి గళంబును నబ్జసంపద వహించు.

156


సీ.

తెఱవ నీవు కటాక్షదృష్టిఁ జూచినఁ గాముకాండముల్ తృణమునఁ గట్టరాదె
నాతి నీవించుక నవ్వినఁ బూర్యచంద్రికల జాడ్యంబు నొందింపరాదె
భామ నీవు ప్రియోక్తిఁ బలికినఁ జిలుకలఁ బట్టిబందిగములఁ బెట్టరాదె
లోలాక్షి నీవు కెంగేలు పైఁజేర్చినఁ జిగురాకులఁ జలింపఁజేయరాదె


తే.

లేమ నీదయ నామీఁద లేమినింత, వెతల పాల్పడవలసెను వీనిచేతఁ
గాక నీప్రాపు గలిగినఁ గడఁగి వీనిఁ, బట్టిపల్లార్తుగాదె నీపాదమాన.

157


సీ.

రాజబింబాస్య యీరాజకీరములకు నీముద్దుమాటలు నేర్పుకొఱకొ
యిందీవరాలక యీపూవులకు నెల్ల నీమేనితావులు నింపుకొఱకొ
నవమోహనాంగి యీనమలిగుంపులకు నీతిన్ననినడుపులు దిద్దుకొఱకొ
వామాక్షి యీపల్లవములకు నీమోవితళుకుఁ గెంజాయఁ బైకొలుపుకొఱకొ


తే.

కాక యివ్వనసీమ నిట్లేకతంబ, యేకతంబునఁ దిరిగెదవే యొయారి
నన్ను ధన్యనిఁ జేయుయత్నంబు దక్కఁ, గలదె కలవాణి యొండొకకారణంబు.

158


శా.

నాసాగంధఫలీపరాఙ్ముఖగతి న్నాతీ భవత్కేశభృం
గీసంఘం బిరుపాయలై వెనుకకుం గేడించి యచ్చోట గుం
పై సొంపొందినభంగి సుందరతరంబై చారుసీమంతరే
ఖాసంయు క్తిని గీలుగంటు సిగ శృంగారంబు రాజిల్లెడున్.

159


సీ.

భామినీమణి బెండువడనిసింగిణులు నీకనుబొమ్మ లైక్షపకార్ముకునకు
జలజాక్షి యక్షయశరములు నీకటాక్షపరంపరలు పంచసాయకునకుఁ
గలికి చాయలు వోనిఖడ్గముల్ నీకేలుదోయి ప్రవాళకౌక్షేయకునకు
నెలఁత మనోగతి మెలఁగువాహములు నీకులుగుఁబల్కులు కీరఘోటకునకుఁ


తే.

దనకుఁ దగ వివి జాడ్యంబు లనుచు మొదలి, సాధనంబులు పూర్వపక్షములు చేసి
యతివ నీయంగకములు సిద్ధాంతములుగఁ, గైకొనియెఁజుమ్ము మరుఁడు లోకముల గెలువ.

160


సీ.

కురియదే కలువక్రొవ్విరివాన జోరున నీవు వీక్షించిన నీరజాక్షి
నిండదే పండువెన్నెలతేట చల్లఁగా నీ వింత నవ్విన నీలవేణి
మొరయదే పంచమస్వరలీల ఘుమ్మన నీవు మాటాడిన నిరుపమాంగి
పొలయదే గమ్మన మలయజామోదంబు నీయూర్పు సోఁకిన నిమ్ననాభి