పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈరీతిఁ దిరిగి తిరిగి ప, యోరుహదళనేత్ర దైవయోగమువలనన్
దారాతారారమణకు, మారుం డగుబుధునియాశ్రమంబునఁ జేరెన్.

148


ఉ.

చేరిమనోజసుందరవిశేషతనూవిభవాభిరాముఁ గే
యూరకిరీటకుండలముఖోజ్జ్వలదివ్యవిభూషణాద్యలం
కారు సమందహాసముఖకాంతివినిర్ణికపూర్ణిమాతమీ
చారుకళావిధు న్వినతసర్వబుధున్ బుధుఁ గాంచి ప్రేమతోన్.

149


వ.

ఇట్లని వితర్కించె.

150

స్త్రీయైన సుద్యుమ్నుఁడు బుధుని మోహించుట

సీ.

అలివేణులకు మనోహరముగాదే వీనికెందమ్మిచాయలకేలుదోయి
కీరవాణులకు నోరూరింపదే వీనిమాధురీకలితబింబాధరంబు
మనచకోరాళుల కెదఁ భ్రమగొల్పదే వీనిపూర్ణేందుబింబాననంబు
వరకోకకుచలకు వలపుపుట్టింపదే వీనిమార్తాండతేజోనిరూఢి


తే.

యహహ వీనివసంతమోహనవికాస, మేలతాంగుల నలరింప దెంచిచూడ
ననుచు రాగరసార్ద్రాంతరంగ యగుచు, సుదతి కనుఱెప్ప వెట్టక చూచె నతని.

151


ఉ.

ఆయరవిందరాగరుచిరాధర నాహరినీలవేణి నా
శ్రీయుతమౌక్తికద్యుతివిశేషదరస్మిత నానవప్రవా
ళాయతపాణిపాదయుగ నావరహీరనఖాళిఁ గాంచి యా
హా యిది రత్నరాశి వనితాకృతి దాల్చి మెలుగెడుం జుమీ.

152


వ.

అని తలంచుచు నసామ్యసౌమ్యసద్గుణరమ్యుం డగునాసౌమ్యుండు మదనప్రదర
విదళితహృదయుం డైయమ్మదవతం గదియవచ్చి యి ట్లనియె.

153


మ.

నవలావణ్యవిలాసమోహినివి చానా నీవు గంధర్వకాం
తవొ విద్యాధరభామవో విహగసౌందర్యాంగివో సాధ్యక
న్యవొ సిద్ధాంగనవో భుజంగసతివో యక్షాంబుజాతాయతా
క్షివొ గీర్వాణవధూటివో తెలుపుమా చిత్తంబు రంజిల్లఁగన్.

154


చ.

పరభృతపఙ్క్తి నీయధరపల్లవలబ్ధియుఁ దుమ్మెదల్ భవ
త్సరసముఖాంబుజాప్తియును సంగతిఁగోరి వనంబులం దప
శ్చరణలు చేసి సుస్వరముఁ జక్కనిచూపులు నై మెలంగెడున్
బురుషులు నిన్నుఁజూచి మరుపూన్కికిఁ జిక్కరె నీకుఁ దక్కరే.

155