పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రాచుర్యామృతసారపుష్కరిణికాప్రాంతాయతోదార శో
భాచంద్రోపలవేదికాస్థలిఁ బ్రభల్ భాసిల్ల నాసీనుఁ డై.

128


చ.

దరహసితామృతంబు ముఖతామరసంబు నలంకరింప నా
హరుఁడు ముదంబున న్వనవిహారపరిశ్రమలాలసాంగి న
గ్గిరిసుతఁ గాంచి కేలితమిఁ గీల్కొనుసన్న యెఱింగి నెచ్చెలుల్
సరసగతిం దొలంగి కనుచాటగుచోటుల నుండ నయ్యెడన్.

129


తే.

అంబుజాననఁ గౌఁగిట నలమియలమి, యిష్టకేలీసుఖంబుల నెనసితనిసి
యంకపీఠంబుపై నుంచి యలపుసొలపు, దీఱ లాలించి పలికె సుస్థిరుఁడు హరుఁడు.

130


చ.

అడుగులు చూడఁ గెంజిగురుటాకులు చేతులు లేఁతతీఁగె లె
క్కుడుజిగిచన్నుదోయి పువుగుత్తులు మోవిరసంబు పక్వమై
వడుచుఫలద్రవంబు ప్రియవల్లభ చక్కనికొమ్మ వౌట ని
న్నెడయక యిన్నిరూపముల నివ్వనదేవత యాశ్రయించెనో.

131


తే.

తరుణి నానీలకంఠాభిధానమునకు, దోఁచె నర్థాంతరము పరితోషసరణి
సాంద్రసీమంతభూషాసురేంద్రచాప, సహితయుష్మత్కచాబ్దదర్శనమువలన.

132


సీ.

మృగశాబకంబు హస్తగతంబు సేయుట సుదతి నీకన్నులు చూచికాదె
యరచందమామను శిరసుపైఁ దాల్చుట వెలఁది నీనుదురు భావించికాదె
గగనంబు కేశసంగతము గావించుట చెలువ నీకౌను లక్షించికాదె
భుజగంబులను హారములుగా ధరించుట కలికి నీకీల్జడఁ గాంచికాదె


తే.

కొమ్మ నీయంగములపోల్కి కొంతకొంత, కలిగియుండుటఁ బ్రియమయ్యెఁ గాక మాకు
వీని భరియించుటకు నించుకైనఁ గలదె, కారణము పూర్ణచంద్రసంకాశవదన.

133


చ.

కలికి శిరీషపుష్పములకంటెను మిక్కిలికోమలంబులై
యలరు భవన్మనోహరతరాంగకము ల్నినుఁ జూచి యేగతిన్
దెలియఁగవచ్చుఁ గొండకుజనించినదానవటంచు నీదుని
శ్చలపటుకర్కతోన్నతకుచద్వయి తెల్పఁగఁగాక కోమలీ.

134


చ.

అనవుడు లేఁతనవ్వు జిగి యందపుఁజెక్కిలిదోయి కుందనం
బునకు మెఱుంగువెట్ట గొనబుంబచరింపుల సిగ్గుఁ బ్రేమయుం
బెనఁగొని వాలుఁగన్నుఁగవ బిత్తరిచూపుల నాదరింప మో
హనమధురోక్తి నుత్తరములాడుచునుండె భవాని శంభుతోన్.

135


వ.

ఆసమయంబున.

136