పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

రంగమరంగ వెన్నెల తరంగములై తనుకాంతి నిగ్గుతే
రంగ జవంబుచే జితకురంగమనంగ నభంగభేరికా
రంగదురుస్వనంబు దనరంగ గుణోన్నతి నశ్వశాస్త్రపా
రంగతహృద్యమౌ నొకతురంగము భూషితచాతురంగమున్.

79


ఉ.

కనకఖిలీనముం బసిమిగ్రమ్మెడు పచ్చలహేమపట్టమున్
ఘనమగుజాతికెంపులచ కాటపుబల్లము మౌక్తికావళిం
దనరెడుకంఠమాలిక లుదంచికవజ్రమయావతంస మిం
పొనర నలంకరించి తనయొద్దకు దెచ్చిన నెక్కె నశ్వమున్.

80


తే.

బొమిడికంబులు వెట్టి జోళ్లమరఁ దాల్చి, చల్లడంబులు దొడిగి కాసలు బిగించి
జముదళంబులు చెక్కి బల్లెములు పూని, వెడలి రప్పుడు పెక్కండ్రు వేఁటకాండ్రు.

81


చ.

దెసమొలవేల్పుసాహిణపుతేజులు పోషకగేహరక్షకుల్
విసువనికమ్మకట్టు మఱి వింతజనంబుల బీతుగొల్పుక
క్కసమగురక్కసుల్ వనమృగంబులపాలిటి మృత్యురూపముల్
వెసఁ జనుదెంచె నత్తఱిని వేఁటకు గాటపుసారమేయముల్.

82


సీ.

అల దుర్గ యెక్కిరింతల వెక్కిరింతలాడెడురీతి నాలుకల్ వెడలఁజాఁచు
నిఱ్ఱిగుఱ్ఱపురౌతు నెక్కసక్కెములాడుగతి వాలవిక్షేపకలనఁ దాల్చుఁ
దొడరి కొండల నెత్తి యడవఁబూనెడు మాడ్కిఁ బదరి చివ్వునఁ బూర్వపదము లెత్తు
గర్జితంబులసారె భర్జించుకైవడి మొఱుగునార్భటముగా మోరలెత్తు


తే.

బలిమి కలిమిని జనము సంపదను దిట్ట, తనము పెంపున దారుణధ్వనినిరూఢి
జాగిలంబులు మృగయు లచ్చంపుఁబసిఁడి, పట్టెడలఁ బట్టి వెడలించునట్టియెడను.

83


సీ.

ధర నల్పులకుఁ బ్రభుత్వంబు వచ్చిన మనుష్యులవికారపుఁజూడ్కిఁ జూచినట్లు
పల్లవుల్ తుదిలేమిపడి యింటిచాయరా మొగిలంజెతల్లులు మూల్గినట్లు
పరదేశి యతిలోభపరునియింటికిఁ బోవఁ దెగి కోఁతివలెను గద్దించినట్లు
వంతువాసికి హీనవైశ్యులు దమలోన సేకంబుగాఁ గలహించినట్లు


తే.

తెరలి యొరుఁడొక్కటి నిరూక్షదృష్టిఁ జూచు, గొఱగొఱను మూల్గు గద్దించుఁ దఱిమి తఱిమి
కవిసి కలహించు భౌకృతికలకలముగ, జాగిలమ్ములు రోషభీషణము లగుచు.

84


తే.

బెబ్బులి తుపాకి సుడిగాలి పిడుగుతునుక, భూతనాథుండు గడిపోతు పోతురాజు
గండగొడ్డలి దొంగలమిండగీఁడు, మొదలుగాఁ బేరుగల వేపు లుదుటనడచె.

85


వ.

ఇట్లు చనిచని.

86