పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఆనందాశ్రులు కన్నులం దొరుఁగ సాష్టాంగంబుగా మ్రొక్కి వా
చానైపుణ్య మెలర్పఁగా నుపనిషత్సారస్తుతుల్ చేసి యిం
పూనం బల్కె వివస్వదాత్మజుఁడు పుత్రోత్పాదనార్థంబు య
జ్ఞానుస్థాన మొనర్పఁ గూఁతు రుదయంబయ్యె న్వికల్పంబుగన్.

70


క.

మనువునకుఁ బుత్రదానం, బనుగ్రహింపంగ వలయు నని ప్రార్థింపన్
విని యక్కూఁతురు కొడుకౌ, నని యానతి యొసఁగి యరిగె నంతర్హితుఁడై.

71


వ.

అప్పుడు.

72

ఇలాకన్య పురుషుఁ డగుట

సీ.

కొదమలేళ్ళకు సిగ్గుగొలుపువాల్గన్నులు తరుణారుణాబ్జసుందరము లయ్యెఁ
గరికుంభకుచమనోహర మైనయురము నిర్మలకాంచనకవాటరమ్య మయ్యె
మువ్వంపుఁదీఁగెల నవ్వుచేతులు మత్తమతంగశుండాసమంబు లయ్యె
మధుమాసపికరవమధురకంఠము మేఘగంభీరనిస్వనకలిత మయ్యెఁ


తే.

బొదవు లజ్జాభయంబుల నొదుఁగుమనసు, ధైర్యశౌర్యనిరంకుశత్వము వహించె
నయ్యిలాకన్యకును నీశ్వరాజ్ఞవలన ప్రాప్తమయ్యెను బౌరుషభావ మపుడు.

73


తే.

కోమలశ్మశ్రురేఖాభిరామమైన, యక్కుమారునివదన మాహ్లాద మొసఁగె
సకలజనలోచనోత్పలషండమునకు, లక్ష్మియుతపూర్ణశశిమండలంబు కరణి.

74


శా.

దాసత్వంబు తొలంగి మండలపతిత్వం బబ్బినం బ్రాపితో
ల్లాసోత్కర్షతఁ బొంగుమానవునిలీలన్ భామినీరూపస
న్యాసంబై పురుషత్వ మబ్బినఁ బ్రభుత్వాహంకృతిం బొల్చు శో
భాసౌందర్యవిచిత్రుఁబుత్రుఁ గని సాఫల్యాత్మసంకల్పుడై.

75


వ.

వైవస్వతుండు వసిష్టానుమతంబున నక్కుమారునకు సుద్యుమ్నుం డని నామనం
బిడి విద్యాపారంగతుం గావించె నంత.

76


చ.

కరితురగాధిరోహణము కార్ముకబాణకృపాణచక్రతో
మరముసలాదిసాధనసమాజపరిశ్రమమున్ వసుంధరా
భరణరణప్రవీణత యుపాయచతుష్కనిరూఢి యాదిగాఁ
బరిచితమయ్యె సర్వము నృపాలకుమారునకుం గ్రమంబునన్.

77


క.

అంతట నొకనాఁ డాక్ష్మా, కాంతతనూభవుఁడు వేఁటకాండ్రును దానుం
గాంతారభాగములకుం, బంతంబున వేఁటఁబోవఁ బయనం బయ్యెన్.

78