పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తి న్నిజమందిరంబునకుఁ దెచ్చుక నిర్భయకేలిలోలుఁడై
యున్నయెడన్ బృహస్పతి వియోగవిచారవిషాదమగ్నుఁ డై.

32


సీ.

సకియకౌనుఁ దలంచి సన్మార్గ మనుగాని యింతిదుర్మార్గత యెంచఁడయ్యెఁ
జెలువచన్గవఁ దలంచి సువృత్త మనుఁగాని తరుణికువృత్తంబుఁ దలఁపఁడయ్యె
నతివమోముఁ దలంచి యకలంక మనుఁగాని తెఱవకలంకంబు దెలియఁడయ్యె
సుదతినవ్వుఁ దలంచి శుచి యనుఁగాని యవ్వెలఁదుకయశుచి భావింపఁడయ్యె


తే.

గురునివంటిమహాత్ముఁ డిక్కరణిఁ దరుణి, చక్కఁదనమే గుణంబుగ సంస్మరించుఁ
గాని వ్యభిచారదోషంబుఁ గాంచఁడయ్యె, నజ్ఞుఁ డనఁ బ్రాజ్ఞుఁ డన నెవ్వఁ డవని నింక.

33


తే.

అమృతమయుఁ డౌట శశి పవిత్రాంగు డనియొ, తనమహిమ దారదోషంబు దలఁగుననియొ
యమరగురుఁ డింతి విడువలేఁడయ్యెఁ గాక, పెనిమిటికి నేల కడలుత్రొక్కినలతాంగి.

34


వ.

ఇవ్విధంబున.

35


క.

ఏపొద్దు ఖేదమున సం, తాపించుచునుండె నతఁడు ధరలో భార్యా
రూపవతీ శత్రువని క, దా పెద్దలు పల్కి రేల తప్పు నటంచున్.

36


ఆ.

సుదతి వ్రతము చెడిన సుఖము దక్కఁగవలె, నన్నమాటఁ దలంచుకొన్నదేమొ
కాఁపురంబు చేసెఁ గలికి ముచ్చటఁదీఱ, మగని విడిచి తేరమగనియింట.

37


వ.

అంత.

38


మ.

రతిబంధప్రతిబంధకం బురుపరీరంభక్రియాస్తంభనం
బతిహేలామణితాంతరాయము నిజప్రాణేశకేళీజిదా
యతమీనధ్వజయుద్ధతంత్రపటుతాహంకారశంకాంకురం
బతులస్ఫూర్తి నెసంగె గర్భము నవవ్యాకోచపద్మాక్షికిన్.

39


ఉ.

వీడనిప్రేమలం గలియు వేఁకటివ్రేఁగుట లంతికూటముల్
వేడుకకు న్వినోద మొదవింపఁగ నయ్యువనాథుతో హిత
క్రీడ మెలంగుచుండ నరిగె న్నవమాసము లంతమీఁద న
చ్చేడియ గాంచె నందను నశేషవిశేషగుణాంబుధిన్ బుధున్.

40


వ.

అబ్బాలకుండు సుధాధాముధామంబునం బెరుఁగుచుండ నపుడు.

41


తే.

చంద్రునకు బుద్ధిచెప్పి వాచస్పతికిని, దార నిప్పించితిరి గాదె మీరు మరల
నింతవృత్తాంతమును నీవు నెఱుఁగు దైన, సరణిఁ బలుకంగవలసెఁ బ్రసంగవశత.

42


క.

ఈరీతిఁ దారకును గమ, లారికి జన్మించినట్టి యాబుధునకు శృం
గారవతి కిలాకన్యకు, సారమతి పురూరవుండు సంభవమయ్యెన్.

43