పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

తత్ప్రకారంబు వివరించెద నాకర్ణింపుము.

44

బుధునిచరిత్రము

తే.

జలజబాంధవవంశవిస్తారకుండు, మహితకీర్తి వైవస్వతమనువు సకల
ధారుణీమండలాధిపత్యమునఁ దనరు, చుండి సంతానకాంక్షచే నొక్కనాఁడు.

45


ఉ.

రాజికరత్నకాంచనతురంగమతంగజధేనుదాసదా
సీజనదివ్యమందిరవిచిత్రదుకూలవిలాసభాసురాం
భోజముభీముఖోజ్జ్వలవిభూతి నెసంగుట నిష్ఫలంబుగా
దే జగతిం దనూభవవిహీనత నొందినయట్టివానికిన్.

46


చ.

తొకతొకమాటలు న్నొసలఁ దుంపెసలాడెడు నుంగరంపువెం
డ్రుకలును మద్దికాయలు గడుంగదులాడగ ముద్దుగారు పొం
దిక జిగిపాలబుగ్గలను దేలికచూపులుఁ గోమలంపుటం
గకములు గల్గి యింపొదవుఁగా సుతుబాల్యము తండ్రి కెంతయున్.

47


సీ.

కాంతాకుచద్వయీకాఠిన్యసంపద వెలితియయ్యును వేడ్క విస్తరిల్లు
వినుతాంగియవలగ్నతనుతావిలాసంబు కొదవయయ్యు ముదంబు కొనలు సాగుఁ
గలకంఠకంఠిచెక్కులనిండుతేటలు పలుచనయ్యును గుతూహల మెసంగు
మృగనేత్రతనులతజిగిబిగిసొగసు తక్కు వయయ్యుఁ బ్రమదంబు కొమరుమిగులు


తే.

యౌవనోన్మాదజనితచేష్టావికార, కలితలలితవతీరతికౌశలంబు
పెంపు దఱిఁగియు ఘటియించు నింపుమిగులఁ, బురుషునకుఁ బుత్రలాభంబె పరమహితము.

48


క.

అని తలఁచి కులగురుం డగు, ననుపమగుణనిధి వసిష్ఠుఁ బ్రార్థించి యతం
డనుమతి సేయఁగఁ బుత్రునిఁ, గనుటకు నై యధ్వరంబుఁ గావించెఁ దగన్.

49


సీ.

సవనక్రియోచితసకలవస్తుసమృద్ధిఁ గావించి భువనవిఖ్యాతదాన
మహిమఁ జెల్లుచు నుండి మంత్రతంత్రకలాపపరిశుద్ధి నమరు విప్రవ్రజంబు
గూర్చి దీప్తానలకుండంబులోపల హోమంబు చేయుచు నున్నవేళ
నమ్మనుభామిని యైన శ్రద్ధాదేవి కూఁతురు గలుగంగఁ గోర్కి వొడమ


తే.

హోత నధ్వర్యుఁ బ్రార్థించి యువిద గలుగఁ, జేయుఁడనియె నిజేశు వంచించి యపుడు
బుద్ధిహీనలు సతులని పుడమిలోన, జనులు పల్కెడుమాట నిశ్చయము గాఁగ.

50


క.

ఆతలిరుఁబోఁడి కోరిన, రీతిని సంకల్పవైపరీత్య మొదవినన్
హోతపెడచేతఁ బుట్టెను, నాతి యిలాకన్య యనఁగ నవమోహినియై.

51