పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నహహ యీయద్భుతమున కేమనఁగవచ్చు, సకలజనరంజనుండైన చంద్రునకును
జంద్రుఁడై చాలహృదయరంజన మొనర్చె, సుందరీమణివదనారవింద మపుడు.

22


తే.

తనకలిమిలేములను సర్వజనుల కుభయ, పర్వములఁ దెల్పుశశికి నప్పద్మనయన
యభిముఖంబైనఁ బున్నమ యగుచుఁ దోఁచు, ననభిముఖ్యమైన నమవస యగుచుఁ దోచు.

23


ఉ.

జక్కువలిక్కువ న్ఘనకుచస్తబకంబులపేరఁ జీఁకటుల్
చక్కనికొప్పుపేర జలజంబులు కన్నులపేర నెచ్చెలిం
దక్కక యాశ్రయించి పరితాపపరంపరపాలుఁ జేసి నా
చుక్కలఱేనిఁ దీర్చుకొనఁజూచి సుమీ తమపూర్వవైరముల్.

24


తే.

ఆసుధాధామునకు విదాహంబు గొలుపు, నాహిమాంశునిఁ బరితాప మందఁజేయు
నాకళానిధిఁ ద్రోచు మోహాంధకార, మున నొరుల నెంత చేయఁడు మనసిజుండు.

25


చ.

చదువు వివేకమూలమని సద్గురుసన్నిధి వేదశాస్త్రముల్
చదువఁగ వచ్చినట్టి యలచంద్రునకుం గురుపత్నిపొందు క
ష్టదశ ఘటింపఁజేసె నకటా యిఁక నేమనవచ్చు దైవమున్
మది నిది పుణ్యమౌ నని యొనర్పఁగఁ బాపము వచ్చు టేమొకో.

26


వ.

అని జనం బెంచుచుండఁ జంద్రుండు.

27


క.

దోషాకరుండుఁ దారా, శ్లేషసుఖాన్వితుఁడుఁ గాన శీతాంశుఁడు దా
దోషాకరుండుఁ దారా, శ్లేషసుఖాన్వితుఁడు నయ్యె సితగజగమనా.

28


సీ.

బొమ ముడివెట్టుమాత్రమె కాని ప్రియుఁడు పాలిం డ్లొత్తిపట్టుట కిచ్చగించుఁ
గసరుమాత్రమె కాని కాంతుఁ డాయము లెత్తి వెసఁబల్కుట కపేక్ష వీను లొగ్గు
కొంగు పైనిడుకోఁ బెనంగుమాత్రమెకాని విటుఁడు గోప్యములు జూచుటకుఁ గోరు
సీత్కృతు ల్వెడవెడఁ జేయుమాత్రమె కాని పతిమోవినొక్కుసంగతికి నలరు


తే.

సొలయు మాత్రమే కాని నెచ్చెలిమికాఁడు, కఠినరతి సల్పుటకు సముత్కంఠ దాల్చుఁ
బులకహర్షాశ్రుసుఖజలోద్భూతగరినుఁ, దనవలపు జారునకుఁ దెల్పుఁ దరుణి యపుడు.

29


వ.

ఇత్తెఱంగున.

30


క.

అన్యోన్యమోహవిభమ, సన్యస్తవివేకు లగుచు శశలాంఛనుఁడుం
గన్యామణియును గోర్కులు, ధన్యత నొందంగఁ గలసి తమి చిగురొత్తన్.

31


ఉ.

కొన్నిదినంబు లిక్కరణి గోప్యముగా విహరించుచుండి య
య్యన్నుపయిం బ్రియంబు హృదయంబున నగ్గలమైనఁ జంద్రుఁ డిం