పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

లేని ప్రయోజనం బైనఁ గల్పించుక పలుమాఱుఁ దత్సమీపమునఁ దిరుగు
వలరాజుచిల్కుముల్కులవంటిచూపుల ననువుగా మర్మము ల్నాటఁజూచు
నుచితక్రమంబునఁ గుచకచాద్యవయవసౌభాగ్యములు ప్రకాశంబు చేయు
సమయమైనప్పుడు సారస్యముగ నర్మగర్భంబులైన వాక్యములు పలుకు


తే.

నతఁడు తనమోము చూచినయపుడు దీన, వదనయై సోష్మదీర్ఘనిశ్వాసవశతఁ
దనమనోవ్యధ యతనిచిత్తమున కెఱుక, పఱుచు నాకాంత విరహవిభ్రాంత యగుచు.

15


తే.

ప్రాణహానిఁ దలంపరు పాప మనుచు, నెంచ రపకీర్తి యని చూడ రిందుముఖులు
వలపుగలచోట నెట్లైనఁ గలయఁజూతు, రెంతసాహసు లహహ సీమంతవతులు.

16


తే

అనుదినము నిట్లు హావభావాదిచేష్టి, తములు మోహింపఁగాఁ జేసెఁ దార విధునిఁ
బురుషుమన సెంత దృఢమైనఁ బువ్వుఁబోఁడి, వికృతి పైకొన్న సెగపొంతవెన్న గాదె.

17


వ.

ఇవ్విధంబున.

18


సీ.

హరినీలము మించి యరిలీల వెలయించి వేణియు శ్రోణియు వింతదనర
విరి నిరాకృతిఁ జేసి కరికరాకృతి డాసి యొడలును దొడలును నొప్పుమీఱ
నగజాతములఁ గేరి మృగపోతముల మీఱి చన్నులుఁ గన్నులుఁ జెన్ను మిగుల
వరకుందములఁ బోలి యరవిందముల నేలి రదములుఁ బదములు రహి వహింప


తే.

గురుని భవనంబునందు సుందరి మనోజ, విమలఘంటారవాయతవిమలకనక
చరణమంజీరపుంజసింజానినాద, యగుచు నిట్లు మెలంగఁ బద్మాహితుండు.

19


క.

పాపపరాఙ్ముఖతామతి, దీపాంకుర మన్నెలంతదీర్ఘశ్వసితా
టోపమరుద్ధతి నడఁగినఁ, బ్రాపితమోహాంధకారబంధురుఁ డయ్యెన్.

20


సీ.

లలనానితంబమండలముపై నుత్పలదళములు రచియింపఁ దలఁచుఁగాని
తరుణికెమ్మోవిమీదఁ బ్రవాళమణిసొంపు గులుకఁగా ఘటియింపఁ దలఁచుఁ గాని
జలజాక్షి కుచకుంభములమీఁదఁ శశకప్లుతంబు దా నొనరింపఁ దలఁచుఁగాని
మృగరాజమధ్య నెమ్మేను లతావేష్టితంబునఁ బెనగొనఁ దలఁచుఁగాని


తే.

తలఁపఁ డెప్పుడు గురువని తాసమాగ, మాగతాత్యుష్ణదురితదవానలంబు
దుస్సహం బని కటకటా తొగలఱేఁడు, కలుగదుగదా వివేకంబు కాముకులకు.

21


సీ.

తా సుధానిధి యయ్యుఁ దరుణికెమ్మోవిసుధారసంబునకు నోరూరుచుండుఁ
దాఁ జంద్రికాసాంద్రతనుఁ డయ్యుఁ గుసుమకోమలిదరస్మితచంద్రికలకుఁ జొక్కుఁ
దాఁ గళానిధి యయ్యుఁ దరళాయతాక్షికళావిశేషమున కుల్లాసమొందుఁ
దా మృగాంకమనోజ్ఞతనుఁ డయ్యు నలివేణిలోచనమృగదీప్తిఁ జూచి సొగయు