పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

చెలఁగుమద్దెలమ్రోఁత జిలుగు రాణింపంగఁ బదపద్మముల లయప్రాప్తి చూపి
లయధృతమధ్యవిలంబము ల్రహిఁ దాళశారీరమున గీతసరణి నెరపి
గీతమాధుర్యవాగ్విభవంబు బయలుగాశయముల నర్థాభినయ మొనర్చి
యర్థాభినయమున కందంబుగా, లోచనంబుల రసపోషణంబు చేసి


తే.

రసము శృంగారవీరాదిరమ్యగతుల, జూపఱుల డెందములు నిండి సొరిదివెల్లి
విరిసి ముఖపంకజంబుల విశ్రమింప, నాట్యమాడిరి మగువ లానంద మొదవ.

192


చ.

దదిగణతె య్యటంచు సముదంచికమర్దళతాళమానసం
పద జతగూడ నబ్బిరుదుపాత్రలు చేయుకళాంజిక ల్ప్రమో
దదమగుచుండెఁ బో తళుకుతళ్కుతళుక్కనుచు న్వెలుంగునం
బుదనినదార్భటీసహితభూరితటిల్లతికాసమంబు లై.

193


సీ.

వేదశాస్త్రపురాణవిద్యాప్రసంగము ల్చేరి మహర్షులు చేయుచుండ
జలపాకజంభనిర్దళనాదివిజయము ల్విద్యాధరేంద్రులు వినుతి సేయఁ
గడఁగి షడ్జర్షభగాంధారముఖరవఫణితి గంధర్వులు పాటవాడఁ
గుండలీప్రేరణీదండలాసకముఖ్యనృత్యంబు లచ్చర ల్నెఱపుచుండఁ


తే.

జెలఁగి త్రిభువనరాజ్యలక్ష్మీవిరాజ, మానవైభవలీలాసమానగరిమ
నిట్లు గొలువున్న యవ్విభుధేశ్వరుండు, పలికె నారదమునిఁ జూచి ప్రస్ఫుటముగ.

194


శా.

ఏలోకంబున సంచరించితిరి మీ రేయేవిశేషస్థలం
బాలోకించితి రేప్రసంగమున మీ కచ్చోట నిన్నాళ్లుఁ దాఁ
గాలక్షేపము చెల్లె సంశ్రవణముం గావింపు శ్రోతవ్యవా
ర్తాలాలిత్యవచస్సుధారససుధాధారాపూర్తి నోనారదా!

195


వ.

అనిన నమ్మహేంద్రునకు మునీంద్రుం డిట్లనియె.

196


మ.

జగదాధారకుఁ డచ్యుతుం డెచట నర్చారూపబాహుళ్యతం
దగు నానావిధపుణ్యవాహినులచేతం బొల్చు నెచ్చోట పెం
పగుసత్కర్మధనంబుఁ గూర్పఁగ నుపాయం బేస్థలం బన్నిటం
బొగడొందున్ భువియందు నుత్తమము జంబూద్వీప మూహింపఁగన్.

197


వ.

అందు.

198


సీ.

శ్రీపురుషోత్తమక్షేత్రసువ్యక్తస్వభావు జగన్నాథదేవుఁ గొలిచి
మంగళాచలమహామండపాభ్యంతరవర్తి శ్రీనరసింహమూర్తిఁ జూచి