పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

ఘనచింతామణిభద్రపీఠమున రంగల్లీల నాసీనుఁడై
వినతాశేషసుపర్వసంఘమకుటావిర్భూతదీప్తు ల్పదా
బ్జనఖశ్రీల భజింప భూషణమణిచ్ఛాయ ల్వెలుంగన్ శచీ
స్తనకుంభద్వయగంధసారయుతముక్తామాలికోరస్కుఁ డై.

183


ఉ.

ముందొకవేళయందు సురముఖ్యుఁడు పద్మములందు డాగినాఁ
డందుకు నాఁటిచెల్మిని సహస్రదళంబులఁ బాయలేక మై
బొందొనఁగూడ నుంచుకొనఁబోలుఁ జుమీయన వేయికన్నులున్
సుందరమై వెలుంగఁ గడుశోభిలుచున్న నిలింపవల్లభున్.

184


మ.

కలితాష్టాపదరత్నకంకణఝణత్కారప్రయుక్తావలో
లలనాహస్తసరోజచామరమరాళవ్రాతసంజాతకో
మలవాతప్రకటాంగరాగవిలసన్మందారమాలాసము
జ్జ్వలసౌరభ్యవిశేషహృష్టసభికస్వాంతున్ శచీకాంతునిన్.

185


క.

కనుఁగొని తత్ప్రత్యుత్థా, ననమస్కారంబులను మనంబలరఁగ దీ
వన లిచ్చి యమ్మునీంద్రుం, డనుపమకనకాసనస్థుఁ డయియున్నయెడన్

186


క.

చారణవిద్యాధరగరు, డోరగగంధర్వముఖ్యు లుచితస్థితులం
జేరి వినయంబుతో జం, భారాతిం గొలిచియుండి రాసభలోనన్.

187


వ.

అప్పుడు.

188


మ.

పదవిన్యాసవిలోలనూపురకదంబస్వానములు ల్ఘల్లనన్
మదదంతావళరాజయానములతో మాణిక్యహారావళుల్
కుదురుంజన్నులపై వెలుంగ సుమనఃకోదండపాండిత్యసం
పదఁ బెంపొందిన యూర్వశీముఖ నిలింపస్థానవేశ్యామణుల్.

189


సీ.

సోమపానపవిత్రసుముఖులు గాక యీయధరబింబామృతం బానఁగలరె
వైరిహేతివిశీర్ణవక్షులు గాక యీపాలిండ్లఁ గౌఁగిటఁ బట్టఁగలరె
బహుదానవిఖ్యాతబాహులు గాక యీనిద్దంపుఁజెక్కిళ్లు నివురఁగలరె
ఘనతపోవ్రతకృశగాత్రులుగాక యీయుత్సంగశయ్యల నుండఁగలరె


తే.

యనుచుఁ గనుచూపులకు వింత బెనుచుప్రేమ, ననుచు మనముల సుర లెంచుకొనుచు నుండ
మదనదైవతమోహనమంత్రశక్తు, లనఁగ నచ్చర లేతెంచి రపుడు సభకు.

190


తే.

వచ్చి పురుహూతునకు మ్రొక్కి వరమృదంగ, పాద్యరవహృద్యతాళాన పద్యనాట్య
విద్య చోద్యంబుగాఁగఁ బ్రవిస్తరించి, పడఁతు లొనరించి రప్పుడు భరతఫణితి.

191