పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చిన బహుజన్మభాగ్యమునఁ జేసి యవిద్యఁ దొలంగి సత్యమై
యనుభవమయ్యె నాత్మఁ జిదహంబను సంస్కృతి సుస్థిరంబుగన్.

176


వ.

ఇట్లు బరమజ్ఞానసంపన్నుండయిన యమ్మహామునీంద్రునుపదేశంబున నానృపాల
శేఖరుం డఖండసంపత్పరిపూర్ణుండై యానందంబున నతనికి సాష్టాంగవందనంబులు
చేసి యనేకవిధంబులఁ బ్రస్తుతించె. నారదుండును నతనిమనీషావిశేషంబునకు సంతో
షించుచు బహుభంగుల నాశీర్వదించి వీడ్కొని స్వర్గగమనోన్ముఖుఁడయ్యె నప్పు
రూరవుండును యథేచ్ఛాప్రవర్తనంబున సుఖస్థితుండయ్యె నఁట నారదుండు
చని చని.

177

నారదుఁడు నాకమున కేఁగుట

శా.

కాంచె న్మౌనివరుండు ముందట నభోగంగాతరంగచ్ఛటా
చంచచ్చంలచంచరీకచయసంచారంబు భూసంచయా
కించిద్బంధురగంధబాంధవమరుత్ఖేలాగవాక్షావళీ
ప్రాంచత్సౌధచరక్రియాన్వితసుపర్వానీకమున్ నాకమున్.

178


సీ.

వివిధదానాధ్వరోత్సవపుణ్యపరిపాకఫలభోగదేశ మేపట్టణంబు
కావలంబై యొప్పు నేవీడు కల్పపాదపకామధేనుచింతామణులకు
భువనత్రయాధిపత్యవిభూతి నొప్పు సుత్రామున కేప్రోలు రాజధాని
గరుడగంధర్వకిన్నరసిద్ధచారణాహీంద్రాదిసేవితం బేపురంబు


తే.

సకలసౌభాగ్యలక్ష్మీప్రశస్తి నగ్ర, మగుచు నేపుటభేదనం బమరుచుండు
నట్టియమరావతిని గాంచి యంతరంగ, మునఁ బ్రమోదంబు నొందె నమ్మునివరుండు.

179


క.

ఆదిత్యమండలస్థితి, చే దీపితమైన దివము చెలువునఁ దగి య
య్యాదిత్యమండలస్థితి, చే దీపితమైన దివము చెలు వమరంగన్.

180


వ.

కని తదీయవిశేషంబు లగ్గించుచు నట చని.

181


సీ.

ఒకచోటఁ బ్రకటహాటకసముద్యద్దీప్తిపుంజ మాతపపరిస్ఫూర్తి చూప
నొకచోటఁ బద్మరాగోపలప్రభలు సంధ్యారాగవిభ్రమం బావహింప
నొకచోట వజ్రమౌక్తికధాళధళ్యవినిర్మలరుచులు వెన్నెలలు గాయ
నొకచోట హరినీలనికరవిస్ఫుటనైల్యకాంతులు చీఁకటు ల్గ్రమ్మఁ జేయ


తే.

మిశ్రబహువిధమణిగణామితమరీచి, జాల మొకచోఁటఁ గిమ్మిరలీల నింప
వైభవశ్రీసమున్నతి వర్ణనీయ, మగుసుధర్మాభిధానసభాంతరమున.

182