పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

జ్ఞానారూఢుఁడు బాహ్యచేష్టల మనస్సంకల్పుఁడై చేయు నే
మైనం బాకృతు నట్ల వానిఁ గని తా నాచేష్టలే చేయఁగాఁ
బో నల్పజ్ఞుఁడు వంచన న్మదిఁ దలంపు ల్మాన కారూఢుఁడ
న్నేనంచున్ ఫలమేమి చేష్టల మది న్నిశ్చింత లేకుండినన్.

156


ఆ.

మనసు చల్లఁబడక మాట లెన్నాఁడిన, ముక్తిగాదు వాదశక్తి గాని
మనసె కారణంబు మఱి బంధమునకు మో, క్షమున కనుచుఁ దెలుపు చదువు వినమె.

157


క.

జ్ఞాతృజ్ఞానజ్ఞేయము, లేతెఱఁగున వేఱు దోఁప కేకంబుగ న
ద్వైతాత్మత వెలుఁగు ప్రపం, చాతీతుం డెవ్వఁ డతఁడె యారూఢుఁ డిలన్.

158


క.

ఇది నగర మిది యరణ్యం, బిది సౌఖ్యం బిది యసౌఖ్య మీతఁడు పురుషుం
డిది సతి యని తోఁపద యె, య్యది చూచిన బ్రహ్మమయమ యారూఢునకున్.

159


తే.

సంగములు సర్వమును గల్గి సంగి కాఁడు, భోగములు సర్వమును చెంది భోక్త గాఁడు
కార్యములు సర్వములు చేసి కర్త గాఁడు, విగతసంకల్పుఁ డగుబ్రహ్మవేత్త యధిప.

160


ఆ.

ఇచ్చలేనియోగి కింద్రియంబులు కర్మ, వశతచే స్వభావవర్తనముల
మెలఁగుచున్న నేమి యిలఁ బుణ్యపాపంబు, లంట వతఁ డకర్త యగుటఁ జేసి.

161


తే.

నిర్విషయచిత్తుఁ డగుబ్రహ్మనిష్ఠునకును, దనుసుఖంబులు ప్రారబ్ధమున ఘటించు
నంతియేకాని యవి వాని నంటకుండు, గమలపత్రాగ్రమున జలకణికవోలె.

162


తే.

శయ్య నుండియుఁ బెక్కుదేశములవెంటఁ, దిరుగఁ గలగాంచుచున్ననిద్రితునిభంగి
సచ్చిదానందుఁ డయ్యుఁ దా జననమరణ, బాధలను బొందినట్లుంట భ్రాంతిగాదె.

163


క.

కలలోన నఱుకులాడినఁ, గలవే గాయములు మేలుకాంచిన వెనుకం
దెలియక మునుపటిసంసృతి, కలఁకలు విజ్ఞాని కేల గలుగందోఁచున్.

164


క.

ఆయెఱుక దొరకు కొఱకుఁ గ, దా యోగజపాదినిష్ట లాయెఱుక దృఢం
బైయున్నతఁ డేక్రియలం, జేయఁడు లోకోపకృతికిఁ జేసిన జేయున్.

165


మ.

తొలిజన్మంబుననైన నిప్పుడయినన్ దుష్కర్మనిర్మూలనం
బిల బ్రహ్మార్పణసత్క్రియామహిమచే నెంతేధృతిం జేసి ని
ర్మలుఁ డైనన్ శ్రవణంబు తన్మననముద్రాసన్నిధిధ్యాసలున్
సులభంబౌ శ్రవణాదు లబ్బక చలించుం దామసత్యాగతన్.

166


క.

ఈమేనను సత్కర్మము, లేమియుఁ జెందకయె చెందు నిద్ధజ్ఞానం
బామునుపటిభవమున ని, ష్కామసుకర్మాప్తి విగతకల్మషుఁడైనన్.

167