పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాఁటికి వాని కన్నిసుగుణమ్ములు దామె ఘటింప ముక్తుఁడౌ
బూటకపున్విచారములఁ బోవఁగ నేమిఫలంబు భూవరా.

148


క.

సుగుణం బెఱిఁగి భజించిన, నగు నిర్గుణసిద్ధి సిద్ధుఁడగు నాతనికిన్
జగమెల్లను బ్రహ్మమయం, బుగఁ దోచును సర్వకాలమును నొక్కగతిన్.

149


సీ.

బయల సంరంభి లోపల నసంరంభియై కార్యతంత్రంబులు గడపెనేని
సఫలప్రయత్నంబు విఫలప్రయత్నంబు దనకుఁ దుల్యంబుగాఁ దలఁచెనేని
ననివార్యమై కర్మమున వచ్చుసుఖము వర్ణించినయట్లు భోగించెనేని
సౌఖ్యంబు దుఃఖంబు సంప్రాప్తమైనచో నుబ్బుస్రుక్కులు లేకయుండెనేని


తే.

జీవపరమేశ్వరైక్యసచ్చిత్సుఖాను, భూతి నిస్సంశయాత్ముఁడై పొలిచెనేని
నతఁడు ప్రారబ్ధమున వ్యవహారియైన, ముక్తిసామ్రాజ్యపట్టాభిషిక్తుఁ డగును.

150


చ.

వనమున నున్న నేమి గృహవాసము చేసిన నేమి యాత్మభా
వనయు నసంగవృత్తి యరివర్గజయంబును గల్గియుండినన్
వనమున నున్న నేమి గృహవాసము చేసిన నేమి యాత్మభా
వనయు ససంగవృత్తి యరివర్గజయంబును లేకయుండినన్.

151


క.

దేహము తాఁ గానని నిజ, మూహింపఁగ నేర్చి నట్టి యుత్తమునకుఁ ద
ద్దేహమునకైన బాంధవ, దేహంబులు మిథ్య లనుచుఁ దెలియంబడవే.

152


సీ.

పుత్రమిత్రకళత్రమైత్రి వర్తిల్లు వసిష్ఠసంయమిబ్రహ్మనిష్ఠ వినమె
కర్మకుండై రాజధర్మ మూని చరించు జనకునివిజ్ఞానచర్య వినమె
వాణిజ్యవృత్తి జీవనుఁడైన యలతులాధారునిపూర్ణబోధంబు వినమె
కటికిగాయకముచేఁ గాలంబుఁ గడపు ధర్మవ్యాధువిజ్ఞానమహిమ వినమె


తే.

వారిప్రారబ్ధమున నుండవలసి జ్ఞాను, లెట్టివ్యవహారముల నున్న నేమి కొదవ
జ్ఞానవైరాగ్యనిశ్చలానందపూర్ణు, లైనవారు జీవన్ముక్తులగుట నిజము.

153


క.

ఏయాశ్రమమున నుండిన, నాయాచారములు నడప కాశ్రమసుఖతృ
ష్ణాయత్తమతిని వంచకుఁ, డై యే నిష్కర్మి ననుట నర్థముగాదే.

154


ఉ.

కర్మము బంధకం బని సుకర్మము మాని సుఖంబు గోరి దు
ష్కర్మము సేయుచు న్బుధులు కాదనిన న్విన కాత్మకున్న వే
కర్మములంచుఁ దాఁ జెడుట గా కొకకొందఱిజ్ఞాననిష్ఠకుం
గర్మఫలాప్తికిం జెఱుచుఁ గాపురుషుం డుపదేష్టనంచు ని
ష్కర్మికి నాస్థలేదు భయకర్మములు న్విధిచే ఘటించినన్.

155