పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

కలిమికొలంది ఠీవి గమకంబుకొలందిఁ బ్రవర్తనంబు దో
ర్బలముకొలందిఁ బూన్కి యనురక్తికొలంది సమాదరంబు మే
లొలయుకొలంది యత్నము నియోగికొలందిని భార మీగియుం
దెలివికొలంది మాటయు నుతింపఁగ యోగ్యతఁ దెచ్చు నేతకున్.

128


శా.

సర్వజ్ఞత్వముఁ గల్గి కీర్తిలతికాజాలంబు చక్రాద్రిపైఁ
బర్వ న్నిశ్చలధర్మమార్గమున సప్తద్వీపసామ్రాజ్యము
న్నిర్వైరస్థితి నేలు నీకుఁ దలప న్నీతిప్రకారంబు లో
యుర్వీనాథ! నిసర్గసిద్ధములు గానోపు న్విచారించినన్.

129


వ.

అని మఱియు బ్రసంగోచితంబు లగువిశేషభాణంబుల నభినందించు మునిపుంగవుం
గనుంగొని వినయనమ్రవదనకమలుం డగుచు మహీవల్లభుం డి ట్లనియె.

130


ఉ.

ఎందఱు రాజు లీయవని నేలినవా రిఁక నేలనున్నవా
రెందఱు లెక్క సేయఁ దరమే పరిమేష్టికి నైన నట్లనే
నందఱిలోన నొక్కరుఁడనై ధరయేలుట యెంతప్రాభవం
బిందుల కింతపెద్దగ మునీశ్వర నన్గొనియాడ నేటికిన్.

131


ఉ.

హము వాయుసంచలితదీపిక పుత్రకళత్రమిత్రసం
దోహము స్వప్నకాలమునఁ దోఁచెడిసందడి రాజ్యభోగస
స్నేహముఁ జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీ
యైహికసౌఖ్య మేమిసుఖమంచుఁ దలంచెదనయ్య నారదా.

132


సీ.

కామరోగాదిదుష్కరశత్రువర్గప్రతాపప్రధానసాధనము ధనము
జన్మపరంపరాసంపాదితానేకఘనకర్మజాలవర్ధనము ధనము
కైవల్యసంప్రాప్తికారణవైరాగ్యధర్మమార్గావరోధనము ధనము
సకలావగుణపుంజసంశ్రయాశారూపదారుణనిగళబంధనము ధనము


తే.

గలిగి గర్వంబు దొట్టి దుఃఖంబు మదికిఁ, బెనుచు నజ్ఞానపావకేంధనము ధనము
స్వప్నలబ్ధపదార్థంబు చందమునను, దలఁచి జూడంగ వట్టిదంధనము ధనము.

133


ఉ.

చక్కెరపూఁత పూసిన విషంబులు భామలవాక్యవైఖరుల్
చక్కగ వెన్న మెత్తినసిలల్ విరిబోఁడులచిత్తము ల్మణు
ల్చెక్కినసంకెంలల్ సతులచేష్టలు కొమ్మల నమ్మవచ్చునే
యక్కట మేఁకవన్నెపులు లంగన లెన్నిట నెన్ని చూచినన్.

134