పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుఁడు పురూరవునకు రాజనీతి చెప్పుట

చ.

మతియుతు బుద్ధిశాలిఁ బరమర్మవిభేదనదక్షు సత్కళా
చతురుని శాంతునిన్ సమరసాహసుఁ గార్యవిచారకౌశలుం
బతిహితశీలు షడ్గుణవిభాసురు భృత్యజనప్రజామనో
హితనిజవర్తను న్వసుమతీశుఁడు మంత్రిగఁ జేయఁగాఁదగున్.

118


క.

తా నెంతయధికుఁడైనం, గానీ మనుజేశ్వరుండు కార్యాకార్య
జ్ఞానము నిజప్రధానుల, తో నాలోచించి యుక్తితో నెఱుఁగఁదగున్.

119


క.

సప్తాంగరక్షణంబును, సప్తోపాయము లొనర్చుసామర్థ్యంబున్
సప్తవ్యసనవిరక్తియు, సప్తద్వీపేంద్రరాజసద్ధర్మంబుల్.

120


సీ.

న్యాయంబు దప్పనినడవడితోడను బెంపుగాఁ బ్రజలఁ బాలింపవలయు
నుచితవ్యయంబు సేయుచు నర్ధసంపద ల్కొదవగాకుండంగఁ గూర్పవలయు
శౌర్యోజ్జ్వలములైన చతురంగబలముల నెంతయు విరివిగా నేలవలయు
సమయంబు బలము విచారించి పైకొని పరరాజ్య మాక్రమింపంగవలయు


తే.

నేమఱుట లేక గడిదుర్గసీమలందు, నాప్తులును గార్యఖడ్గప్రయత్నపరులు
నయినవారలఁ దగినసైన్యములతోడ, నునుపవలయును దనపేర్మి యొరులు పొగడ.

121


క.

తనరాజ్య మొరుల రాజ్యం, బనవలవదు బుద్ధికుశలు లగుచారులఁ బం
చి నిఖలవార్తలు నిచ్చలు, వినుటొప్పును భూవిభుండు విశ్రుతమతియై.

122


క.

బలవంతులతోఁ బగయును, బలవద్భాంధవులతోడి పగయును ధరలోఁ
బలువురతోఁ బగయును మఱి, బలభేరికినైనఁ దెచ్చు భంగముఁ దలపన్.

123


క.

చెలిమియ యుచితం బెంతయు, బలవంతునితోడ నతఁడు పగవాఁడైనం
జలియింప కంతకంటెను, బలవంతునిచెలిమి వడసి పగ యీఁగఁదగున్.

124


చ.

నిజభుజశక్తినైనఁ దననేర్పునఁ దంత్ర మొనర్చియైన న
క్కజముగ వారిపైఁ బలముఁగల్గినవారలఁ గూర్చియైన వై
రిజనవినాశనంబు నొనరింపక జాడ్యముచేత నున్న భూ
భుజునిప్రభుత్వ మెల్ల నదిపొంతమహీజము గాదె భూవరా.

125


క.

విశ్వాసపరుల నెఱిఁగి న, రేశ్వరుఁ డధికార మిచ్చు టెంతయు నుచితం
బైశ్వర్యయుతులు గాఁగ న, విశ్వాసులఁ జేయఁదగదు విమలవిచారా.

126


తే.

కరుణ తన కెంతగలిగిన కనకవస్తు, వాహనాదులు చాల నీవలయుఁ గాని
భూతలేశ్వరుఁ డెంతయాప్తులకునైన, నాజ్ఞఁ ద్రోవంగ నిచ్చుట యనుచితంబు.

127