పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మనుమఁడైన పురూరవక్ష్మాతలేంద్రుఁ, జూడ నేతెంచుచంద్రునిజాడ దోఁప
నరుగుదెంచె నభోమార్గయానమునను, నారదుఁడు మూర్తిజితశరన్నారదుండు.

106


తే.

స్వాంతములు పల్లవించెను సత్కదంబ, ములకుఁ బంకజాతమ్ముల పొంక మెడలె
భువనము శుభోదయస్ఫూర్తిఁ బొలుపుమిగిలె, నారదాగమమున కది నైజమకద.

107


వ.

ఇవ్విధంబున.

108


ఉ.

వచ్చినఁ జూచి లేచి పరివారముతో నెదురేగి యవ్విభుం
డచ్ఛపుభక్తి మ్రొక్కి కనకాసనసుస్థితుఁ జేసి పూజలన్
మెచ్చొదవింపఁగా వినయమేదురమంజులవాక్యవైభవం
బెచ్చ ననేకభంగుల మునీంద్రుఁడు దీవన లిచ్చి వెండియున్.

109


క.

కుశలంబె మీకు హితులకుఁ, గుశలమె కుశలంబె బంధుకోటికి నెల్లం
గుశలమె భృత్యశ్రేణికిఁ, గుశలంబె ధరిత్రిప్రజలకు న్మనుజేంద్రా.

110


వ.

అని పలికిన నాసంయమీంద్రచంద్రునితోఁ జంద్రవంశతిలకుండు వినయ
సంభ్రమమాధురీధురీణవచనంబుల నల్లన ని ట్లనియె.

111


క.

మీకారుణ్యమువలనను, మాకందఱకు న్శుభంబు మౌనీశ్వర మీ
రాకవలన మద్భాగ్యము, లోకస్తుతమయ్యె జగతిలోపల నింకన్.

112


తే.

వినుతమోగుణహర్తవై వెలయునీవు, మిత్రరూపంబుతో వచ్చి మేలొసంగ
నిపుడుగద యజ్ఞకులమున కెలమియగుట, చక్రవర్తిత్వ మిఁకఁ గదా స్పష్టమగుట.

113


క.

అని పలుకునన్నరేంద్రుని, వినయోక్తుల కలరి మౌనివిభుఁడు తదీయా
ననమునఁ గారుణ్యరసం, బెనయఁ గటాక్షములు నిగుడ నిట్లని పలికెన్.

114


సీ.

ఉత్తమాన్వయమున నుదయంబునొందుట సరిలేనిసౌందర్యశాలి యగుట
యఱువదినాల్గువిద్యలఁ బ్రవీణుండౌట పటుబాహుశౌర్యసంపన్నుఁ డగుట
ధరణిచక్రాచలాంతంబుగా నేలుట నిగ్రహానుగ్రహనిపుణుఁ డగుట
వేదశాస్త్రోక్తసద్విధు లాచరించుట యాచార్యగుణముచే నధికుఁ డగుట


తే.

హరిహరబ్రాహ్మణార్చనానిరతుఁ డగుట, యాత్మవిదుఁ డౌట యొక్కనియందుఁ గలవె
పుణ్యనిధివైన నీయందె పొసఁగె నిన్ని, సద్గుణములు పురూరవస్సార్వభౌమ.

115


క.

స్తుత్యుం డమరులకైనను, నిత్యోన్నతుఁ డైనధారుణీపతి “రాజా
ప్రత్యక్షదైవత” మ్మన, సత్యవ్రత పూర్వవచనసంగతి వినవే.

116


వ.

అని పలికి వెండియు నమ్మహానుభావుం డమ్మానవపతితో రాజనీతిప్రసంగంబున
నిట్లనియె.

117