పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఆరాజేంద్రకులావతంస మొకనాఁ డత్యంతసంప్రీతి నా
నారత్నప్రకరప్రకీర్ణసముదీర్ఘస్వర్ణవాతాయనో
దారస్తంభవిటంకకుడ్యపటలోద్యద్వేదిగోపానసీ
ద్వారస్ఫారకవాటశోభితసభాస్థానాంతరస్థాయి యై.

100


సీ.

చరణాబ్జనఖకాంతిచంద్రిక ల్నతభూపముకుటాగ్రమణులపై ముసుఁగువార
గణుతింపరానిచక్కఁదనంబు ప్రేక్షకవీక్షణంబులకును విందు లొసఁగ
గంభీరమధురవాక్యచమత్కృతు ల్సభాసదులకుఁ గర్ణరంజన మొనర్ప
సానుగ్రహములైన యవలోకనము లర్థికోటి కిష్టార్థము ల్గురియుచుండ


తే.

విగ్రహచ్చాయకాంచనవిమలమకుట, వలయముఖభూషణములకు వన్నె లొసఁగ
చిత్రకంఠీరవాసనాసీనుఁ డగుచుఁ, జెలగి కొలువుండె నారాజశేఖరుండు.

101


తే.

సత్ప్రసంగంబు దనర నార్జవముఁ గలిగి, కడగి తగుచోటులను గురుకవిబుధాదు
లుండ సింహాసనస్థుఁడై యుండె నినుఁడు, ధారణీప్రజ కానందకారి యగుచు.

102


సీ.

వింజామరంబుల విసరుపూఁబోడుల కంకణఝణఝణత్కారరవము
మురువుగా సుతిఁగూడి మొదయించువైణికవల్లకీనిక్వణక్వణరవంబు
కడుసొంపుగా నాడు కర్ణాటనాటికాకనకమంజీరఘల్గలరవంబు
ప్రణతపార్థివశిరఃస్రగ్గంధలోలతఁ దిరుగుతుమ్మెదలఝంకరణరవము


తే.

మిళిత మగుచు సుధారసగళిత మగుచు, లలిత మగుచు మనోరథఫలిత మగుచు
నానినాదం బపూర్వమోహనవిలాస, మహిమఁ జెన్నొందెఁ దత్సభామండపమున.

103


సీ.

సింధునాయకుదండఁ జేరె జీవనముఁ గల్గుట చాలునని మత్స్యకువలయేశుఁ
డలవత్సనరపతి యాభీరభూమిపాలకుసమీపమున నిల్కడ వహించె
నాడంబరస్ఫూర్తి నమరుచున్న నిషాదనాథునిఁజేరె గాంధారవిభుఁడు
కెలనఁ గుంతలరాజు బలమధ్యమునఁ జొచ్చి వసియించె బాహ్లికవల్లభుండు


తే.

మఱియుఁ దక్కిననృపతు లేమాడ్కిఁ దమకుఁ, దగినవారలతో గూడి తగిలి నిలిచి
రధిపుఁ బోడఁగనుఖండాంతరాధిపతులు, సందడికి నోడి యెప్పుడో సమయ మనుచు.

104


వ.

ఆసమయంబున.

105

పురూరవునియొద్దికి నారదుఁడు వచ్చుట

సీ.

లాంఛనంబు సముజ్జ్వలభుజాంతరస్థితిమహతిరూపంబున రహివహింప
నమృతంబు విష్ణునామాక్షరమధురగాంధర్వరూపంబునఁ దరఁగలెత్తఁ
జంద్రిక ల్ధళధళాచ్ఛశ్వేతశారీరకాంతిరూపంబునఁ గ్రమ్మికొనఁగఁ
జల్లఁదనంబు శశ్వత్కృపారసపూర్ణదృష్టిరూపంబునఁ దేటపడఁగ