పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చన్నులు మాంసపుముద్దలు, గన్నులు దుర్జలముఁ బుసులుగాఱెడితొరటల్
వెన్నులు నెముకలపాతర, లన్నుల నిటు తెలిసి వలచు టవివేకమెకా.

135


తే.

మూత్రపతనస్థలం బపవిత్ర మనుచుఁ, ద్రొక్కరా నేలఁ గని రోసి తొలఁగుచుందు
రట్టిమూత్రపుగాలువ యైనదోలి, యోని దానికి రోయ దీయుల్ల మహహ.

136


చ.

కొడుకులు గల్గుదాఁక నొకకొన్నిదినంబులు చింత నందనుల్
వొడమిన నాయువున్ బలము బుద్ధియు విద్యయుఁ జాలఁ గల్గఁగా
నుడుగనిచింతఁ గల్గి తనునోలిభజింపనిచింత తండ్రి కె
ప్పుడు గడుచింత సేయుదురు పుత్రులు శత్రులు గాక మిత్రులే.

137


వ.

మునీంద్రా! పుత్రదారధనాదిసంగరహితులై విషయసుఖంబులం బరిత్యజించి యర
ణ్యగిరిగుహాంతరప్రముఖవివిక్తప్రదేశంబులం గందమూలఫలంబు లాహారంబులు
సేయుచు మోక్షసామ్రాజ్యపట్టాభిషిక్తు లగుమహానుభావులజీవనంబు పావనం
బని తోఁచుచున్నయది రాగద్వేషమూలంబైన యీతుచ్ఛసామ్రాజ్యం బెంతపూ
జ్యంబు సార్వభౌమత్వాభిమానంబున నవిద్యామగ్నులమైన మావంటివారలకు సంసా
రసారావారంబు తరించునుపాయం బెట్లు గలుగు నానతి మ్మని మోక్షాపేక్షం
బ్రార్థించినం బార్థివోత్తమువాక్యంబు లాకర్ణించి హర్షిత్కర్షమానసుండై నీప్రశ్నం
బింతయొప్పునే యిట్టివైరాగ్యంబు బహుజన్మసుకృతసంచితతపఃప్రభావంబువలనం
గాక సంభవించునే యని వికసితవదనారవిందుండై యత్తపోధనసత్తముండు నృపో
త్తమున కి ట్లనియె.

138

నారదుం డాత్మవిద్యోపదేశము చేయుట

తే.

అడిగితివి వేదశాస్త్రసారాంశమైన, యట్టిపరమరహస్యంబు నవనినాథ
యడుగుదురుగాని ధర్మకామార్థఫణితు, లడుగ రెవ్వరు నీభంగి నాత్మవిద్య.

139


శా.

అజ్ఞానంబునఁ దోఁచుసంసరణదుఃఖావాప్తి యజ్ఞాన మా
త్మజ్ఞానంబున నాశనంబగు దదాత్మజ్ఞాన మయ్యీశ్వరా
నుజ్ఞం గాని ఘటింప దీశ్వరుఁడు సంతోషించువేదోక్తమౌ
స్వాజ్ఞ న్వర్తిలుధర్మము న్నరుఁడు కర్త్తె సేయు సద్వృత్తికిన్.

140


ఉ.

కావునఁ గర్మనిష్ఠ గతకల్మషుఁడైన ముముక్షుఁ డయ్యవి
ద్యావరణంబు వాసి సముదంచితబోధము నొందు బోధలీ
లావిభవంబుచేత సకలంబును బ్రహ్మముగా నెఱుంగు ద
ద్భావము నిశ్చలంబయిన బ్రహ్మముఁ దానగు నిర్విశేషతన్.

141