పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

రాజమార్గంబు నక్షత్రరాజితోడ, నంతరిక్షంబున వెలుంగు టెంతయనఁగ
రాజమార్గంబు నక్షత్రరాజియగుచు, నగరమధ్యంబునందు నున్నతివహించు.

56


శా.

క్రీడాశైలదరీపరిస్ఫుటవితర్దిస్థాపితాంచత్క్షపా
రాడశ్మచ్ఛటలం గరంచు విలసద్రాకానిశాభాసమా
నోడువ్రాతపసాంద్రచంద్రికతదీయోదప్రపూరంబు జా
లై డిగ్గు న్సెలయేఱులై పురివిహర్త్రాహ్లాదముం జేయుచున్.

57


సీ.

చక్రవాళధరాధరక్రియాచాతురిఁ గొంకుదేఱిన పాణిపంకజమున
మహనీయజలధినిర్మాణకేళీలీల వడఁకుదేరినకరవారిజమునఁ
గలధౌతకాంచనాచలశృంగరచనచే నళుకుదేరినహస్తజలరుహమునఁ
నలచైత్రరథనందనారామకల్పన నారితేఱినశయాంభోరుహమునఁ


తే.

గనకగర్భుండు నిర్మించెఁ గనకఘనక, ళావిలాసతనసమాన మై వెలుంగు
వరవరణఖేయహర్మ్యోపవనచయంబు, లప్పురంబున భువనంబు లభినుతింప.

58


తే.

సర్వతోభద్రరేఖాప్రశస్తివలన, భాసురం బైనయట్టియప్పట్టణంబు
సర్వతోభద్రరేఖాప్రశస్తివలన, భాసురంబైన జ్యౌతిషప్రతిభఁ గాంచె.

59


క.

పుటభేదనపటుకేతన, పటసంచలదంచలముల భాసిలుఘటిత
స్ఫుటముక్తామణి రేఖా, మటిమం దారాగణము విభావరివేళన్.

60


మ.

పురనానామణిహర్మ్యదేశచరదంభోజాంబకాస్యాచ్ఛసుం
దరత ల్సూచిన కన్నులన్ నిహితతద్ద్వారస్థలాదర్శవి
స్ఫురితాత్మప్రతిబింబము ల్గని సుమీ పూర్ణప్రభాపూర్ణిమా
హరిణాంకుండు వివర్ణుఁడై యరిగి కార్శ్యంబందు నంతంతకున్.

61


తే.

అలమృగాంకుండు వాతాయనాంతరములఁ, దూఱిపోవుచుఁ జరియించుకారణమున
లీలఁ బురహర్మ్యములు చంద్రశాలలయ్యెఁ, దత్సుధాసేచనమున సౌధంబు లయ్యె.

62


సీ.

గగనగంగాతరంగములఁ దోఁగినచల్లగాలి ఘర్మాంబుశీకరము లణఁప
నమృతంబుచిలుకు శీతాంశుబింబమరీచు లాయాసఖేదంబు నవనయింపఁ
బరువమై చెలువొందు పారిజాతద్రుసూనచయంబు పరిమళానంద మొసఁగ
వీణారవంబుతో నీతెంచుకిన్నరీజనగానములు చెవుల్సల్ల సేయఁ


తే.

జొక్కి నిదురింపుదురు గాఢసురతజనిత, మోహబంధానుగుణనిజబాహుబంధ
విరచనైకీభవత్పరస్పరశరీరు, లగుచు దంపతు లప్పురహర్మ్యములను.

63


తే.

కమలబంధుండు మధ్యాహ్నకాలమునను, దా మహేశ్వరుఁ డైనచందంబుఁ దెలుపు
రజతకుధరాధరావతారప్రకార, హీరసౌధాగ్రసీమలఁ జేరి పురిని.

64