పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

వ.

నాయొనర్పంబూనిన కవిరాజమనోరంజనం బనుపురూరవశ్చరిత్రంబునకుం గథా
ప్రకారం బెట్టిదనిన సకలమునివరేణ్యశరణ్యం బగునైమిశారణ్యంబునం బుణ్యకథా
శ్రవణోల్లాసవికాసముఖులు శౌనకప్రముఖులు సమస్తపురాణవాణీమణిస్యందన
సంచారకరణప్రవీణసూతుం డగుసూతునివలన నుపసూచితం బగుపురూరవశ్చక్రవర్తి
చరిత్ర౦బు విని సవిస్తరంబుగాఁ దెలుపవయునని యడిగిన నక్కథకుం డిట్లని
తెలుపం దొడంగె.

52

ప్రతిష్ఠానపురవర్ణనము

సీ.

వరణాగ్రమణిరాగభరణాంచదుదయాస్తమయహంసశుభ్రాంశుమండలంబు
బహుళసౌధావళీప్రతిబింబభాగపూర్వార్జునస్వర్దీర్ఘికామృతంబు
నీలనభోవాదనిశ్చయాపాదకాగరుధూపధూమరేఖాస్థిరంబు
ప్రతిపదాలిప్తజంబాలకస్తూరికాప్రకటితస్వగుణగోత్రాస్థలంబు


తే.

ఘటితకుట్టిమపటుహీరకాంతికౌము, దీవిధూతతమఃపటలావిధూద
యత్రియామోత్కరంబు విచిత్రవిభవ, సురుచిరంబు ప్రతిష్టానపురవరంబు.

53


సీ.

పణ్యస్థలము లెల్లఁ బద్మాకరములు పద్మాకరతతులు మహావనంబు
లావనంబులు వినోదాగంబు లావినోదాగము ల్గోపురాగ్రాంచితములు
గోపురాగ్రంబులు గురుసభావళులు సభావళుల్ దైవాలయములు చూడ
దైవాలయంబులు ధామస్థితు ల్మఱి ధామస్థితు ల్కడుధర్ము లరయ


తే.

ధర్ము లతిభద్రకరులు తద్భద్రకరుల, యూధముల నెన్నఁగాఁ బ్రమదోత్కరంబు
లచటఁ బ్రమదోత్కరములు ప్రభాసమాన, లనఁ బ్రభాసమానం బగు నప్పురంబు.

54


చ.

నయగుణరత్నసంయుతి వనప్రకటోన్నతి రాజమండలో
దయపరిజృంభమాణత సుధామహితస్థితి శ్రీవిలాససం
శ్రయత ననంతభోగవిలసత్పురుషోత్తముయుక్తి వర్ణితం
బయి కలశాంబురాశిగతి నన్నగరంబు గరంబు చెల్వగున్.

55