పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నఖిలజగత్కర్తయు నగుశ్రీమన్నారాయణస్వామిం గుఱించి యనేకయాగంబు
లొనర్చె నంతం బురందరప్రముఖదేవత లతనికిం బ్రసన్నులయి యభీష్టవరంబు
లొసంగి యుర్వశీకాముకుం డగుట నతనియభిప్రాయంబు దెలిసి యవ్విలాసిని
నతని కిచ్చి నరసురలోకంబుల యథేచ్ఛావిహారంబులఁ జరియించు నట్లు దివ్యత్వం
బొసంగి రంత.

293


తే.

ధరణి నాహవనీయంబు దక్షిణాగ్ని, గార్హపత్యంబు నన విభక్తములు చేసి
త్రివిధమున హోమవిధులు వర్తిల్లఁజేసెఁ, గర్మపరులకు సులభంబుగా నతండు.

294


క.

తనకు వశంగతురాలై, యనవరతము, చెలులుఁ దాను నరమర లేక
త్యనుకూలత నయ్యుర్వశి, చనువును మెలఁగంగ మదనసౌఖ్యాన్వితుఁడై.

295


తే.

పచ్చకపురంబువంటి సుపర్వబోగి, నీలలామంబు చనువు దక్కోలుగొనియెఁ
బంతమున నానృపాలుఁడు భాగ్యవంతు, డెంతఁ దలఁచిన సఫలమౌ నిది నిజంబు.

296


సీ.

వేదశాస్త్రపురాణవిదితమై గణుతింపఁ దగుసదాచారవర్తనమువలన
న్యాయార్జితములైన నవరత్నకనకసామజహయప్రముఖసంపదలవలన
మందారసుమహరిచందనామోదదివ్యాంగనాసురతభోగాప్తివలన
శ్రీవాసుదేవాంఘ్రిచింతనామృతధారఁ బొరయుబ్రహ్మానందపూర్తివలన


తే.

గరిమ ధర్మార్థకామమోక్షము లనంగఁ, దగినపురుషార్థములు నాల్గుఁ దమకుఁదామె
సిద్ధమైయుండ సంకల్పసిద్ధుఁ డనఁగఁ, ధారుణీచక్ర మేలెఁ బురూరవుండు.

297


వ.

అయ్యుర్వశీపురూరవస్సులకు నగ్రసుతుండయి జనియించిన యాయువునకు సహో
దరులయి క్రమంబున శ్రుతాయువును సత్యాయువును జయుండును విజయుండును
నన నేవురు పుత్రు లుదయించిరి. తత్కుమారషట్కంబువలనఁ గ్రమక్రమంబునఁ
బుత్రపౌత్రాభివృద్ధియయి చంద్రవంశపారంపర్యంబు జగద్వితం బయి వెలసె నని
సూతుఁడు శౌనకాదులకుం దెలిపిన నామహర్షులు పరమహర్షరసభరితహృదయు
లయి యతనిం బ్రశంసించిరి.

298


క.

కవిరాజమనోరంజన, మవునన వక్తకును శ్రోత కలిశుభదంబై
భువి నాచంద్రార్కము కీ, ర్తి వెలుంగఁ బురూరవశ్చరిత్రము దనరున్.

299


శా.

శ్రీకాంతాకుచకుంభలిప్తసరసశ్రీగంధసత్సౌరభా
శ్రీకాంతాతతబాహుమధ్యరుచిరశ్రీవత్సవాణీధవ
శ్రీకంఠస్తుతశక్రవాయుతనయశ్రీదాదిసంసేవితా
శ్రీకారప్రతిమానకర్ణయుగళా శ్రీరాజగోపాలకా.

300