పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యండజయాన యంచుఁ తనయార్తత దెల్పుచుఁ బల్కుఁ బల్కులో
మెండుగఁ దోఁచె గద్గదిక మేదినినాయకుకూర్మి యెట్టిదో.

267


తే.

ఇట్లు కరుణంబు నొంది యయ్యింతిఁ గదిసి, వర్తులోత్తుంగదృఢకుచద్వంద్వలిప్త
చందనద్రవ మెదకాఁక చల్లఁజేయ, గాటముగఁ గాంక్షకొలఁదినిఁ గౌఁగిలించి.

268


వ.

ఇట్లనియె.

269


ఉ.

నామది నిన్ను జీవముగ నమ్ముటకా పగదానికైవడిం
గాముని కప్పగించితివి కట్టిఁడిదాన యజుండు నీ మనం
బేమిటఁ చేసెనో యెఱుఁగ నింతదలంచినదాన వక్కటా
యేమిటి కింత నన్ను భ్రమియించితివే పయిపూఁతకూర్ములన్.

270


తే.

మానవతి నీవు కట్టిఁడిమనసుదాన, వగుట నే నేల తెలియలే నైతి మున్నె
హృదయసీమాబహిర్గతాగేంద్రకఠిన, చణభవత్కుచకుంభముల్ చాటుచుండ.

271


క.

కులుకుచు జిలిబిలిపలుకులు, పలుకుచు రసమొలుకుచూపు వదనాబ్జముపైఁ
జిలుకుచుఁ బలుమొననొక్కుల, నులుకుచు రతివేళఁ జొక్కుచుందువు తరుణీ.

272


క.

వదలెను క్రొమ్ముడి వదలియు, వదలనిలజ్జాభరంబు వడికూటములం
గదలెడు నడుమును గదలియుఁ గదలనిచనుదోయి దలఁచి కరఁగెద రమణీ.

273


చ.

పిలుపులయింపు ముద్దుగొనుపెంపుఁ జనుంగవయుబ్బరింపుఁ జె
క్కుల చెమరింపు మైపులకగుంపు వదల్పనికౌఁగిలింపుఁ గ
న్నుల యదలింపఁ గీలుజడనొంపుఁ దలంపున వేడ్క నింపు నీ
కలయిక సొంపు నే మఱవఁగాఁగలనా కలనైనఁ గోమలీ.

274


మ.

అని దైన్యోక్తుల దూఱుప్రాణవిభు నూఱార్చెన్ లతాతన్వి చుం
బనదానంబుల దంతబాహులతికాబంధంబులం జల్పితా
నునయాలాపములన్ జపాకుసుమకాంతు ల్గుల్కు కెమ్మోవిక్రొ
న్ననమాధుర్యరసంపువిందులఁ గృతానందంబు లౌపొందులన్.

275


వ.

ఇ ట్లయ్యిందువదన రాజకందర్పు డెందం బానందంబు నొందఁజేసి యిట్లనియె.

276


మ.

తగునే రాజకుమార మన్మథమనస్తాపంబుచే నింతనె
వ్వగలం బొందఁగ ధైర్యశాలివిగదా వారాంగనాస్నేహమో
హగుణంబుల్ చపలాయితాయతము లెంతైనన్ సతం బేలగున్
నగరే లోకులు నీమనం బిటులు మగ్నంబైన రాగాంబుధిన్.

277