పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నావలనఁ గొఱఁత గలుగదు, నీవచనము దప్పె నింక ని న్నననేలా
దైవకృతం బటువంటిది, భూవర నాకొఱకు వగలఁ బొందకు మింకన్.

258


తే.

పోయివచ్చెద దయయుంచుమీ యటంచు, జనియె నుర్వశి చేలులుఁ దానును యథేచ్ఛఁ
బ్రియునివలవంత మనసునఁ బెట్టదయ్య, వారకాంతలవలపు లెవ్వరికి సతము.

259


తే.

అపుడు కెలన నున్న యట్టిగంధర్వులు, కోమలాంగిఁ దోడుకొనుచుఁ జనిరి
ముదిత శాపదోషమును మును మును లను, గ్రహము చేసినట్లు రహితమయ్యె.

260


క.

అంతటఁ జింతాక్రాంత, స్వాంతుండై వంత నొందె వసుధాకాంతుం
డెంతయు నకటా వలచిన, యింతిం బాసిన విచార మిం తన వశమే.

261


వ.

అప్పుడు.

262


సీ.

సింహాసనోపరిస్థితి యొల్లక లతాంగి తనుమధ్యసీమయందమె తలంచు
భూచక్రపరిపాలనోచితక్రియ మాని తఱలాక్షిసిఱుఁదుచందమె తలంచుఁ
ఘనకుంభగుంభివాహనకేళి చాలించి కలికిపాలిండ్లపొంకమె తలంచుఁ
జాపాస్త్రధారణాసక్తి లేక నెలంత భ్రూకటాక్షవిలాసములె తలంచుఁ


తే.

గనకసంపద లార్జించుకాంక్ష విడిచి, యతివనిద్దంపుమేనిచాయలె తలంచు
నధిపుఁ డిబ్భంగి రాజ్యభోగాభిలాష, వదలి యేప్రొద్దుఁ దన్మయావస్థ నొందు.

263


క.

అసురుసురని సొలయున్ రా, జసురేంద్రుఁడు మలయపవనుచలికసరునకున్
బిసరుహశరుశరవిసరపు, ముసురునకుం దడిసి కిసలములవిసరునకున్.

264


ఉ.

కన్నుల నీరునించుఁ బులకంబులు దాల్చు వహించుఁ గంపమున్
విన్నఁదనంబు నొందుఁ గడువిస్వరతం బలవించు ఘర్మబిం
దూన్నతిఁ జెందు ఱిచ్చవడి యుండును మూర్ఛిలు నంతనింతిపై
కొన్నటులైన లేచు వగఁగుందుచు భూపతి సాత్త్వికాఫ్తిచేన్.

265


వ.

ఇవ్విధంబున నవ్విభుండు విరహవ్యాకులితచిత్తుండై పురంబు చొరనొల్లక యుర్వశి
నన్వేషింపుచుండ నమ్మహీభర్తవర్తనం బరయుటకయి వచ్చి యచ్చేడియ యతని
దైన్యం బవలోకించి యూఱడించుటకయి సరస్వతీతటినీతటంబున సఖీసమేత
యయి పొడచూపిన.

266


ఉ.

గుండియ జల్లు జల్లనియెఁ గోమలిఁ జూడగఁ జూచినంతలోఁ
నిండె జలంబు కన్నులను నీకొఱకై యిటులున్నవాఁడ నో