పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

సమయభంగంబునకు నిది సమయ మనుచు, దవిలితఱి వేచి యున్నగంధర్వవరులు
వారి కనతిదూరంబున వరసఖీజ, నోపకంఠంబునను గట్టియున్నయట్టి.

246


ఉ.

మేషయుగంబుఁ బట్టుకొని మెల్లనె పో నవి భీతిఁ గూయఁ ద
ద్ఘోషము వీను సోఁకిన దిగుల్గొని గొబ్బున లేచి తీవ్రసం
భాషల లెమ్ములెమ్ము నరపాల తగళ్ల మరల్పు దొంగలన్
భీషణశక్తిఁ దోలు మని ప్రేయసి వల్కఁగ నిద్రమబ్బునన్.

247


తే.

లేవకుండిన రోషంబు లేదు నీకు, దెగడి నే మొఱపెట్టంగ మగతనంబు
దక్కి వినియును వినినచందమున నున్నఁ, వాఁడ వెందైన నిటువంటివారు గలరె.

248


క.

కూరిమిబిడ్డలవలెఁ బ్రియ, మారఁగ నేఁ బెంచుకొన్నయట్టితగళ్ళం
జోరుల పాల్పఱచితి నీ, వీరత్వము నమ్మి యింక వేయన నేలా.

249


మ.

అని యక్కోమలి దూఱనాడు పరుషవ్యాహార మేపాటి సోఁ
కెనొ కర్ణంబుల వ్రేటువడ్డపులిభంగి దిగ్గున లేచి య
జ్జననాథుం డదె పోకుపోకు మనుచున్ శాతాసివిక్షేపసం
జనితోద్యద్ద్యుతి యంధకార మణగించందూడె వేగంబునన్.

250


క.

నిద్రాభంగవికారము, రౌద్రావేశమును విస్మరత యొదవింపం
దద్రాజమౌళి జఘనజ, హద్రాజితవస్త్రుఁ డగుచు నరిగె నెఱుఁగమిన్.

251


వ.

అట్లు కదిసి.

252


క.

దాకొని వడి గంధర్వుల, పైకిన్ లంఘించి వేసెఁ బటుహ స్తనట
ద్భీకరకరవాలమున భ,యాకులతఁ దగళ్ల విడిచి యవ్వల జరుగన్.

253


తే.

తస్కురులమీఁద నుఱుకుచో ధరణివిభుఁడు, వీరరసమున భైరవాకారుఁ డయ్యె
నంతమాత్రమె కాదు వీతాంబరత్వ, కారణమునను భైరవాకారుఁ డయ్యె.

254


తే.

అట్లు గంధర్వులను దోలి యాపొటేళ్లఁ, బట్టి తెచ్చిన విభుఁ గాంచి ప్రమద ప్రమద
మంది యెదఁ జేర్చుకొనఁబోయి యతని మేనఁ, జీర లేమికిఁ గలుషితచిత్త యగుచు.

255


క.

ఆలింగన మొసఁగని జవ, రాలం గని తెలిసి వేగ మంబరము కటిన్
జాలిం గట్టెడు నానృప, మౌళిం గలకంఠి వికలమతిఁ గనుఁగొనుచున్.

256


చ.

పలికె నరేంద్రుతోఁ గుముదబంధుకులోత్తమ హీనుభంగి యి
ట్లలుకువలేక వస్త్రరహితాకృతి నాకడ నిల్వఁ బాడియే
యల సమయో క్తియుం దలఁపవైతివి వీడనిపొందు వీఁడుకో
వలసెఁ గదా యిఁకం గలలవంటివి గావె ఋణానుబంధముల్.

257