పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దన నేలా కల దొక్కవేళ భరితప్రాంచన్మణీహారపుం
జనిరోధాంతరితోపగూహముల నిచ్చన్ ముచ్చటల్ దీఱమిన్.

235


క.

ఇవ్విధమున నవ్వేలుపు, జవ్వనియును నవ్విభుండు సరివలపులతో
నివ్వటిలం బువ్విలుతుని, యవ్వింతలఁ గొంతకాల మట్లు మెలఁగఁగాన్.

236

ఇంద్రునిపంపున గంధర్వు లూర్వశికై భూలోకమునకు వచ్చుట

ఉ.

అంతట నొక్కనాఁడు దివిజాధిపుఁ డయ్యమరావతీసభా
భ్యంతరసీమయందుఁ గొలువై బలువైభవ మొప్ప నృత్య మ
త్యంతనిరూఢి నప్సరస లాడఁగ జూచుచు నుండె నుండ య
క్కాంతల నందఱం గలయఁగన్గొని యుర్వశి గానరామికిన్.

237


తే.

తగ విచారించి యచటిగంధర్వవరులఁ, బిలిచి నా డూర్వశిని ధరాస్థలికి నంపి
తిమిగదా నాటనుండియుఁ దిరిగిరాక, యుండఁ గారణ మేమి భూమండలమున.

238


క.

అనవుడు గంధర్వులు త, ద్వనితావృత్తాంత మెల్లఁ దనతోఁ దెలుపన్
విని యేయుపాయమున నై, నను గోమలిఁ దోడితెండు నాకంబునకున్.

239


ఆ.

అని యనుజ్ఞ సేయ నవనికి నేతెంచి, యుర్వశియు నృపాలుఁ డున్నయట్టి
చెలిమిఁ గాంచి యెడలు సేయుటకై వేళ, గాంచి యుండి రప్రకాశవృత్తి.

240


ఉ.

ఆయెడ నొక్కనాఁటినిశియందుఁ దటాంతనికుంజపుంజపు
ష్పాయతదివ్యగంధమిళితాగతవాతపరంపరన్ సుఖ
శ్రీ యెసఁగంగ నొక్కనదిచెంతను సైకతవేదికాస్థలిన్
బ్రేయసియున్ బ్రియుండు గడుఁబ్రేమలఁ గొందలిరాకుశయ్యపై.

241


వ.

ఉన్నయెడ

242


క.

కుసుమశరశాస్త్రవిద్యా, రసికతఁ జౌషష్టికళలఁ బ్రౌఢిమఁ జూపెన్
ముసిముసినగవులు మొగమునఁ, బ్రసరింపఁగ యువతి యుపరిరతులం బతికిన్.

243


కవిరాజవిరాజితము.

ముడిచినపువ్వులు జిల్లలరాలఁగ మూపున వ్రేలెడుక్రొమ్ముడియున్
గడుసుజనుంగవ జవ్వడువన్ గడుగంపము నొందెడుహారములున్
నడుము వడంక మృదుధ్వని నుత్పతనంబులు సల్పెడు బల్పిఱుఁదుం
బొడగని సొక్కె విభుండు కళావతి పూరుషభావరతిక్రియలన్.

244


క.

సమకాలసుఖజలోదయ, శమితస్మరయుద్ధతంత్రసన్నాహములన్
రమణియు రమణుఁడు సొక్కున, నమరం గనుమూయుచున్న యాసమయమునన్.

245