పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఎడఁబాయలేమి ననిచ్ఛతో లేచుచు మోహాప్తి నిడుకొన్న ముద్దుసొగసు
మఱుఁగుగా నవ్వల మరలవీడిన నీవి ముడిగొల్పి పయ్యెదయిడినసొబగు
పిఱుఁదుపై వ్రాలెడు నెఱికురు లసదుగాఁ గొని కేలఁబొదివిన కొప్పువింత
పదముల జాళువాపావాలు దొడివి చప్పు డెఱుఁగరాకుండ నడుచుహొయలు


తే.

కని కరంగెడువిభుని నెమ్మనము నపుడు, ముదిత రాగరసాంబుధి ముంచి యెత్తె
మరలి చూచిన సురతజాగరపుఁగెంపు, నిగ్గు గనుచూపుచే శయ్య డిగ్గి చనుచు.

230


సీ.

చెలువకౌఁగిటినొక్కుచే నెద నేర్పడ్డ నవరత్నహారచిహ్నములతోడఁ
బూఁబోఁడిచుంబనంబులఁ జెక్కులంటిన తాంబూలరసరక్తిమంబుతోడఁ
గొమ్మకన్నుల నద్దుకొనుటచే గళమునఁ గనుపట్టుకజ్జలాంకములతోడ
ముదితపల్లొత్తుల మోవిపైఁ జైలువొందు సరసంపుఁగెంపులవరుసతోడ


తే.

మెలఁతమొనగోటినాటుల మిగుల నంద, గించు సందిళ్ళ చంద్రరేఖికలతోడ
మొదలిచెలువంబునకు వింతమురిప మెసఁగఁ, గేళిసదనంబు వెడలి భూపాలకుండు.

231


వ.

స్నానసంధ్యాద్యనుష్ఠానంబులు నిర్వర్తించి నిత్యోచితదానంబుల మహీసురసంతర్ప
ణంబు గావించి షడ్రససంపన్నంబు లయినభక్ష్యభోజ్యచోష్యలేహ్యపానీయంబులం
దృప్తుండయి కిరీటకుండలగ్రైవేయకేయూరకంకణోర్మికామేఖలాంగదాదిదివ్యమణి
ఖచితజాంబూనదాభరణమనోజ్ఞదుకూలాదుల నలంకృతుండయి సామంతమంత్రి
పురోహితసేనానాయక విద్వత్కవివందిమాగధవిలాసినీపరిచారికాదులు నిజాధి
కారానుగుణంబుగాఁ గొలువు సేయ రాజ్యభారధురంధరుండయి యుండె నయ్యుర్వ
శియు శుద్ధాంతమందిరంబున సఖీసహస్రసంసేవితయై మజ్జనభోజనాదు లనుభవిం
చుచు నుచితంపువిధంబున మెలంగుచుండె నవ్విధంబున నయ్యుర్వశీపురూరవ
స్సు లిష్టోపభోగంబుల నిరతసురతక్రియాసౌఖ్యంబులం దేలుచు.

232


క.

మేడల మెలఁగుచుఁ బొన్నల, నీడలఁ జెలఁగుచు నటద్వనీతటపుళిన
క్రీడలఁ దనరుచు నింపగు, జాడల నలరుదురు వారసతియుం బతియున్.

233


ఉ.

ఒక్కనిమేషమైన నొకరొక్కరిమోములు చూడకుండినన్
మిక్కిలి జాలినొందుదురు మేనులు జీవము లొక్కరూపుగా
మక్కువలం దలంపుదురు మాటికి వెన్నవలెం గరంగుచున్
సొక్కుదు రొండొరున్ దనువుసోఁకిన వారలమోహ మెట్టిదో.

234


మ.

జననాథాగ్రణికిన్ లతాంగికి యథేచ్ఛక్రీడలన్ నిత్యనూ
తనహర్షాప్తియె కాని నెమ్మది విషాదం బింతయున్ లేదు లే