పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వారుణీరసపానవికారమత్త, ఖండితావార్యరతిసౌఖ్యకలన గాంచి
పల్లవులు మెత్తు రత్తఱిఁ బ్రాణబంధు, వగుట నిది యాసవాహ్వయం బయ్యె ననుచు.

188


వ.

అట్టినిశాసమయంబున నప్పురూరవుడు.

189


సీ.

ఘనతరస్తంభసంఘటితమాణిక్యముల్ దీప్తదీపావళీస్థితి వెలుంగ
వాతాయనాయాతవాతపోతంబులు చామరవిక్షేపసౌఖ్య మొసఁగ
నపరంజిమెఱుఁగు నిద్దపుఁగీలుబొమ్మలు పరిచారికలరీతిఁ బనులు సేయ
ముత్యాలపంజరములఁ గీరశారికల్ శృంగారకథలు వచింపుచుండ


తే.

వజ్రసోపాననీలకవాటచంద్ర, కాంతకుట్టిమమరకతఖచితకుడ్య
పుష్పరాగవితర్దికాస్ఫూర్తి నధిక, సుందరంబైన కేళికామందిరమున.

190


చ.

పగడపుఁగోళ్లు వజ్రములపట్టెలు సైకపుఁబట్టుపట్టెడన్
జిగిబిగియైన యల్లికవిచిత్రపటావృతహంసతూలికన్
మిగుల రహించుపానుపున నించినజాజులు గానరా బయిన్
దగువలిపంపురాజదుపధానము గల్గినశయ్యమీఁదటన్.

191


తే.

పవ్వళించినఁ దన్మనోభావ మెఱిఁగి, ప్రోడనెచ్చెలు లుర్వశిఁ దోడి తెచ్చి
యమ్మహారాజుసన్నిధి కనిపి రపుడు, మణితులాకోటినిక్వణక్వణన మెసఁగ.

192


క.

లోలాక్షి ప్రౌఢయయ్యును, బాలికయునుబోలె సత్రపామందగతిన్
డోలాయమానమానస, యై లోపలి కరిగె మోహ మట్టిద కాదే.

193


క.

వచ్చినఁ గనుఁగొని గొబ్బున, గ్రుచ్చి కవుంగిటను జేర్చి కోర్కులు మదిలో
హెచ్చఁగ శయ్యకుఁ దార్చి శ, రచ్చంద్రనిభాస్యమనసు రంజిలఁ బల్కెన్.

194


సీ.

తరుణి నీముఖచంద్రదర్శనాపేక్షఁ జూపులకుఁ బున్నము యొక్కప్రొద్దు లొదవె
నతివ నీమధురవాగమృతపారణవాంఛ శ్రుతులకు నిరశనవ్రత మొసంగె
నాతి నీపరిరంభణస్వర్గభోగేచ్ఛ దేహంబునకుఁ దపసిస్థితి ఘటించెఁ
జాన నీపొందుబ్రహ్మానందగతిరతి నెమ్మది కద్వైతనిష్ఠ పొడమె


తే.

నని తదాసక్తి నయనకర్ణాంగ మాన, సములు నీయండఁ జేర్చు నామమత దెలిసి
మొగము చూపి భాషింపుచుఁ బిగువుకౌఁగి, లిచ్చి కలసి కావింపు మభీష్టసిద్ధి.

195


ఉ.

చన్నులు పద్మకోశములు చక్కనిచేతులు పల్లవాకృతుల్
నెన్నుదు రర్ధచంద్రరమణీయము ముష్టికరప్రమాణతన్
జెన్నగు మధ్య మంగములచే భరతాభినయం బెఱుంగనౌ
చున్నది నిన్నుఁ జూచినఁ దలోదరి యాటకు జాణవౌటనో.

196