పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

నీదులావణ్యాంబునిధిలోనఁ జూపులు మునిఁగి తేలవు చూడ ముద్దుగుమ్మ
నీదుచన్గొండల నెత్తమ్ములకుఁ బ్రాఁకి దిగలేదు భావ మోయిగురుఁబోఁడి
నీకటాక్షశరార్తి నెమ్మేను మ్రాన్పడి తెలివినొందదుగదే జలదవేణి
నీయధరామృతశ్రీ యాసఁ దవిలి నాలుకదాహ మణఁగదు లోలనయన


తే.

నీవు కౌఁగిటఁ జేర్చి మన్నింపుకున్న, భామ నీచక్కఁదనమె నాపాలిటికిని
జాలియున్నది విరహాగ్నిపాలుపఱువ, నించువిలుకానిగుణదోష మెంచనేల.

197


వ.

అని మఱియు నర్మమర్మవచనప్రసంగవశంబునఁ గురంగనయనయంతరంగంబు రాగ
రసతరంగితంబయి కరంగం బలుకుచుఁ గౌఁగిలించునప్పుడు.

198


ఉ.

ఆయతమోహనాంగు మెఱుఁగారెడుకన్నులకొద్దిఁ జూచి యా
హా! యిటువంటి నీచెలిమి యబ్బక యీవఱదాఁక నూరకే
పోయె నయో దినంబులని పొక్కుచుఁ జేర్చె లతాంగి బాష్పధా
రాయు మైనమో మతనిరాజితహారభుజాంతరంబునన్.

199


ఉ.

భూదయితుండు కౌఁగిటను బొందుగఁజేర్ప సుఖించి పూర్వరా
గోదితతాప మప్పతికి నొయ్యనఁ దెల్పుచు వెచ్చనూర్చి త
త్సాదరణోక్తి వెండిఁ బ్రియమందఁగ మోదములోన ఖేదమున్
ఖేదములోన మోదము సఖీమణి మోమునఁ దోఁచు వింతయై.

200


వ.

తత్సమయంబున.

201


తే.

అంబుజాక్షి నితంబబింబాంబరంబుఁ, దివిచి లేఁగౌను నివిరి మోదించె నతఁడు
హైమవేదికఁ దనరు సింహాసనంబుఁ, గొనిన కైవడి మి న్నందికొనినరీతి.

202


తే.

విభుఁడు తమకించి కటిచీర వీడఁదివియ, నంబరము లేక యును విలాసాంగిమధ్య
మంబరం బున్నయట్లుండె నదరి చెదరు, నాయముల సిగ్గు నిలుపలే దాయెఁగాని.

203


వ.

అయ్యవసరంబున.

204


మ.

కృతసంపర్కమనోజ్ఞహారలతికాశ్రీరోమరేఖాసితా
సితమై బంగరుతాళి మేల్పసిమితోఁ జెన్నొందుశోభాసమ
న్వితకాంతాకుచమధ్యమం బనుత్రివేణీసంగముం జొచ్చి భూ
పతిసంకల్పము కాంచె మన్మథపరబ్రహ్మైక్యతానందమున్.

205


చ.

విభునివిలోకనంబు లరవిందదళాయతనేత్ర కౌనునం
దభినతసౌఖ్యలీలల విహారము సల్పి కటిస్థలంబుపై
రభసముతోడ వ్రాలె నొనరన్ సుకృతానుభవంబు చెల్లిన
న్నభముననుండి భూతలమునం బడుమానవుతోడ నుద్దియై.

206