పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

తమ్మి నయమ్ము దప్పఁ గుముదమ్ము ముదమ్మున నొప్పఁ జక్రవా
కమ్ములు జోడువిప్పఁ దమకమ్మునఁ బాంథులపై మరుండు పూ
టమ్ములు గుప్పఁ జీఁకటి భయమ్ముగ దిక్కులఁ గప్ప భాస్కరుం
డమ్మెయి న స్తమించె నుదయమ్మయి మించె నుడుప్రభావళుల్.

173


సీ.

కల్పించెఁబో నీలకైరవమాల్యసంబంధముల్ ధమ్మిల్లబంధములను
నిరచించెఁబో మనోహరకురంగీమదతిలకముల్ వరపాలఫలకములకుఁ
గలిగ్ంచెఁబో నీటుకాటుకరేఖలయందము నయనారవిందములకుఁ
గదియించెఁబో లసత్కారాగురువిలేపయోగముల్ ఘనకుచాభోగములకుఁ


తే.

జేసెఁబో నీలివన్నియచీరముసుఁగు, వేయుసదుపాయములు మృదుకాయములకు
నంధకారం బకారణబంధు వగుచు, జారులకు జేరఁ జనునభిసారికలకు.

174


క.

తమిమించె నంతకంతకుఁ, దమిమించెను చిన్నవయసుదంపతులమదిన్
దమకింపుగఁ గలయుటకై, దమకింపుచు మరుఁడు సేయుతహతహవలనన్.

175


తే.

అరికి నరియయ్యె నవ్వేళ నది యుచితము, గాక తమ్ముల కహితమ్ము మిత్రు
నకున మిత్రత గాఁగఁ దానడచె నెట్టి, తగవు దోషాఖ్య వర్తించుఁ దామసులకు.

176


మ.

సమయాధోరణశేఖరుండు తిమిరస్తంబేరమోత్తంసముం
బ్రమదంబారఁగ నిల్పి సాంద్రతరతారావారముక్తామణీ
సముదీర్ణస్థితి నొప్పవిష్ణుపదపున్ జౌడోలు పైనెత్త వే
గమె వాహ్యాళికి వెల్వడం గల శశాంకస్వామికిన్ ముందటన్.

177


క.

పాండిమము దోఁచె నైందవ, మండలధరగర్భభరసమంచిత యగునా
ఖండలదిగ్భామినిముఖ, మండలమున లోధ్రకుసుమమాలాద్యుతియై.

178


తే.

ఉదయపర్వతసంగతి నొప్పి ధవళ, కిరణబింబము నైజరక్తిమ వహించె
నాత్మనిర్లిప్తుఁ డయ్యు దేహాప్తివలనఁ, గర్మఫలభోక్తవలెఁ దోచుకరణి గాఁగ.

179


చ.

చలువవెలుంగు వేల్పులరసాయనపుందొన పాలవెల్లిలో
మొలచినముద్దుపాపఁడు కుముద్వతివేడుకకాఁడు తమ్మిలోఁ
గిలిగలచంద్రబింబముఖికిన్ సయిదోడు చకోరభోజనం
బులనెఱదాత చందురుఁడు పూర్వదిశాస్థలి నొప్పె నయ్యెడన్.

180


తే.

అంతకంతకు రాగంబు నపనయించి, శుచి వహించి సత్సంగతి సొంపు గాంచి
విష్ణుపద మాశ్రయించి యాద్విజవిభుండు, సుగతి గైకొని జగములు పొగడఁ దనరె.

181