పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

మగువకరాబ్జతాండవచమత్కృతిచేఁ దలయంటుచున్నచో
సొగసగు నూర్పుతావి పయిసోఁకినఁ గంకణనాదఝంకృతిన్
మొగమనుతమ్మికిన్ వలచి ముక్కనుసంపెఁగమొగ్గ కల్కిపై
కెగయుచు వ్రాలుచుండె మనుజేంద్రుని పెన్నెఱిగుంపుఁదుమ్మెదల్.

158


మ.

పరఁగన్ భూవిభుమేన నల్గిడి తలం బ్రామెన్ సుగంధద్రవం
బరవిందాస్య నతానతాగ్రకుచకుంభాలోలహారావళుల్
స్మరసామ్రాజ్యపదాభిషేకమునకుం బైవంచు బంగారుగిం
డ్ల రహిం జాఱుసుధాసుధారలన లీలాఖేలనమ్రాంగి యై.

159


తే.

కదిసి జలకంబు వోసి రక్కాంతినిధికిఁ గామినులు కమ్రకరకంజకలితకనక
కాచకంకణకమనీయకలరవంబు, కర్ణహితముగఁ గాంచనకలశములను.

160


సీ.

తడియొత్తె నొక్కసుందరి రాజమౌళికి లాలితధౌతదుకూలమునను
కట్ట నొసంగె నొక్కలతాంగి యధిపతి కసమానమృదులదివ్యాంబరంబు
సిగవైచె నొక్కరాజీవాక్షి విభునకు వికచక్రసూనమాలికలు చుట్టి
ధూపం బిడియె నొక్కతొయ్యలి నృపునకుఁ జందనాగరురజస్సారమునను


తే.

దిద్దె నుదుటను గస్తూరితిలక మొకతె, యలఁదె నొక్కతె నెమ్మేన మలయజంబు
వీవన ధరించి చల్లఁ గా విసరె నొకతె, చంద్రవంశాబ్ధిసంపూర్ణ చంద్రునకును.

161


వ.

తదనంతరంబ.

162


సీ.

గారెలు బూరెలు కండమండెంగ లప్పంబులు మొదలైన భక్ష్యములును
సరసాన్నమును బాయసము సూపము శాకములు మొదలైనట్టి భోజ్యములును
పడిదెంబు లానవాల్ పరిపక్వఫలములు సురసముల్ మొదలైన చోష్యములును
బహువిధంబుల నొప్పు పచ్చళ్లు లేనియల్సిగరులు మొదలైన లేహ్యములును


తే.

నారికేళోదకంబు పానకము చల్ల, నీరు మొదలైన యట్టిపానీయములును
ననఁగ బేరైనపంచపదార్థములును, భూరమణుఁ డిష్టసహితుఁడై యారగించె.

163


ఉ.

కారపుఁగూరలున్ మిగులఁ గాఁగినచారులు నెయ్యి పప్పు పొం
గారినయానవాలు వరమాన్నము కమ్మనిపిండివంట క
ర్పూరమువంటి నెయ్యి కడుఁ బొత్తిగ వార్చిన యన్న ముప్పునన్
గూరిన యల్ల మావు పెరుఁగున్ భుజియించె నృపాలుఁ డయ్యెడన్.

164


తే.

ఉప్పు పులుసు తీపి యొగరు కారము చేఁదు, ననఁగఁ దగినరసము లాఱునుల్బ
ణముల నుల్బణములు నమములు నగుపదా, ర్థముల భోజనంబు ప్రహితమయ్యె.

165