పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అప్పు డప్పడంతిం జూచి యతండు రాగరసమగ్నుం డగుచు నిట్లనియె.

149


ఉ.

నీమొగ మేను నామొగము నీవు నెఱుంగకముందు ముందుగా
నేమి ఋణానుబంధమొ సుమీ సరిమోహము లగ్గలించె నో
హేమలతాంగి యింక మఱుఁ గేటికి నమ్మిక మాట పల్కెదం
గాముఁడు సాక్షి గాఁగఁ గలకాలముఁ గూడి సుఖింత మింపుగన్.

150


క.

నావుడు సంతసమంది క, ళావతి యిట్లనియె నోయిలావల్లభ మ
ద్భావంబున కనుకూలుఁడ, వై వర్తింపంగవలయు నది విను మనుచున్.

151


క.

వేడుకకై తాఁ బెంచిన, జోడుతగళ్లను సువర్ణసూత్రాంచితమం
టాడోలనఘణఘణనిన, దాడంబరకంధరంబు లై తగువానిన్.

152


వ.

చెలికత్తియలచేతఁ దెప్పించి యప్పతికిఁ జూపి యిట్లనియె.

153


అవనీనాయక వీనిదుష్టమృగచోరాద్యాపదల్ పొందనీ
క విమర్శింపుచు నెల్లప్రొద్దు దయతోఁ గాపాడుచుండన్ వివ
స్త్రవికారస్థితి లేక నాకడ వసించన్ మాటపట్టిచ్చెదే
ని వినోదంబుల జోడువాయ కెపుడున్ నీతోడఁ గ్రీడించెదన్.

154

పురూరవుఁ డూర్వశిని నిజపురంబునకుఁ దెచ్చుట

తే.

అనుచు సమయంబు చేసి న ట్లాలతాంగి, వనితల తలంపు లెఱుఁగ నెవ్వరివశంబు
జనపతియు నట్లకా యని సమ్మతించె, వనజముఖులకుఁ బురుషులు వశులుగారె.

155


వ.

ఇ ట్లన్యోన్యస్నేహానుగుణంబు లగుమాటల నాడుకొనిన యనంతరంబ యమ్మహీ
కాంతుం డక్కాంతం దోడ్కొని పురంబున కరుగుతలంపున మరలి వనంబు వెలు
వడి నిజబలంబులం గలుపుకొని యూర్వశీసహితంబుగాఁ గనకరథారూడుం డయి రో
హిణీయుక్తుం డగుచంద్రుండునుం బోలె మహేంద్రవైభవంబున రాజధానికిం జని
సామంతసచివప్రముఖపరిజనంబులఁ దగురీతి బహూకరించి తత్తద్గృహంబుల కనిపి
నిజనికేతనంబు ప్రవేశించి యుండె నప్పుడు పరిచారికాజనంబులు తత్సమయోచి
తంబు లయిన రాజోపచారంబులు సేయుచుండి రయ్యెడ.

156


ఉ.

కంకణనిక్వణంబు ఘలుఘల్లున మ్రోయఁ గపోలపాళితా
టంకరుచు ల్వెలుంగ నుదుటం జిఱుచెమ్మట గ్రమ్మ హారముల్
కుంకుమగంధపున్వలపు గుబ్బలపై నటియింప నొక్కయే
ణాంకనిభాస్య భూపతికి నంటె సుగంధపునూనె యత్తఱిన్.

157