పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నిట్లు నీ చక్కఁదనముతో నీడుగాక, పరిభవము నొంది యున్నశంబరవిరోధి
సాయకాదులు న న్నేమి సేయఁజాలు, నింక నీదయ గలిగిన నిందువదన.

138


క.

అనుమాన మేల నిఁక నే, నినుమానఁగఁజాల నీవు నెఱజాణవు పై
కొనుమా ననుఁ జల్లఁగఁ గను, గొను మాననకమల మెత్తి కువలయనయనా.

139


వ.

అని పలికిన.

140


క.

కనుఁగవ మెఱుఁగులు గ్రక్క, న్వనజాసన ఱెప్పలెత్తి వరుఁ జూచె జరీ
లున మరుఁ డొఱవెఱికి తళు, క్కనఁ గా జళిసించుచంద్రహాస మనంగన్.

141


వ.

ఇట్లు కనుగొని.

142


ఉ.

రాజనిభాస్య పల్కె నలరాజకుమారకుమారుతోడ నో
రాజకుమార ముందు సురరాజకుమారకుఁ జూతు వాహినీ
రాజకుమారుఁ జూతు ధనరాజకుమారునిఁ జూతుఁ గాని నీ
రాజదలేఖ్యమూర్తి సరిరా జగమందు వసింప రెవ్వరున్.

143


శా.

నీలావణ్యము నీగుణాతిశయము న్నీభావము న్నీవచో
లాలిత్యంబును నీప్రతాపమును జాలన్ విన్నదానన్ మరు
త్పాలాస్థానమునందు నారదుఁడు దెల్పన్ మోహవిభ్రాంతనై
భూలోకేశ్వర నాఁటనుండియును నీపొం దాత్మలోఁ గోరుచున్.

144


మ.

విను మయ్యింద్రునిపంపున న్మునితపోవిఘ్నార్థమై వచ్చి ని
న్గనుఁగో నె ట్లొనఁగూడునో యనుచుఁ గాంక్షన్ దైవము న్వేఁడుకొం
చు నిమేషం బొకయేఁడుగాఁ గడపుచున్ క్షోణీశ య కైవడి
న్వనవాసంబులు సేయునాకు నినుఁ గానం గల్గె భాగ్యంబునన్.

145


చ.

విరహమునం గృశింపుచును వెన్నెలయెండల నెండి కంతుపూ
శరములవానలం దడిసి చందనశైలపుఁజల్లగాడ్పుని
బ్బరపువడన్ శ్రమంపడి తపం బొనరించుచు నున్నదాన నో
నరవర నీకునై యిటలు నావల పే మని యింకఁ దెల్పుదున్.

146


వ.

అని మఱియును.

147


మ.

హృదయేశా ననుఁ జూడు నీ కొఱకు నే నిట్లైతి నంచున్ సగ
ద్గదదీనోత్తులచేఁ గపోలఫలకాంతాశ్రూరుబిందుచ్ఛటన్
వదనగ్లాని యెసంగ నుస్సురనుచున్ వామాక్షి చూపెన్ మనో
జదశాయాసకృశాంగవల్లి పతికిన్ సమ్మోహముం జేయుచున్.

148